న్యూఢిల్లీ జనవరి 19
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్, యూపీ డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్యాల సమక్షంలో బీజేపీ తీర్థం స్వీకరించారు.తన అనుచరులతో కలిసి వచ్చిన అపర్ణా కాషాయ కండువా కప్పుకున్నారు.ములాయం చిన్నకోడలైన అపర్ణా యాదవ్ బీజేపీలో చేరడం సంచలనం రేపింది.ములాయం రెండవ భార్య సాధనా గుప్తా కుమారుడైన ప్రతీక్ యాదవ్ ను అపర్ణా 2011లో వివాహం చేసుకున్నారు.అపర్ణా 2017 ఎన్నికల్లో లక్నో కంటోన్మెంటు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు.ఈమె తండ్రి అర్వింద్ సింగ్ బిస్ట్ జర్నలిస్టుగా పనిచేసి రాష్ట్ర సమాచార కమిషనరుగా ఉన్నారు.ఈమె తల్లి అంబీ బిస్ట్ లక్నో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగిని.
అపర్ణా అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయాలు అంశంపై మాంచెస్టర్ యూనివర్శిటీలో పీజీ చదివారు.గతంలో సమాజ్‌వాదీ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నార్సీకి అపర్ణా మద్ధతు పలికారు. 370 చట్టం రద్దును కూడా సమర్ధించారు. అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి అపర్ణా గతంలో 11 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.గతంలో మాజీమంత్రులు స్వామి ప్రసాద్ మౌర్యా, దారాసింగ్ చౌహాన్, ధరం సింగ్ సైనీలతో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీని వదిలి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. కాగా తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అయిన బావ అఖిలేష్ యాదవ్ కు షాక్ ఇస్తూ అపర్ణా బీజేపీ తీర్థం స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది.