న్యూఢిల్లీ జనవరి 19
కరోనా వ్యాప్తి దృష్ట్యా అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయమై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక కరోనా కారణంగా 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 2020 మార్చి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దుచేసినప్పటికీ 'వందే భారత్ మిషన్' కింద కొన్ని దేశాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. అలాగే ఎయిర్ బుబుల్ ఒప్పందంలో భాగంగా అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా సుమారు 40 దేశాలకు విమానాలు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక సర్వీసులకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే కార్గో సర్వీసులు కూడా యథావిధిగా నడుస్తాయని ప్రకటించింది. ఇక గతేడాది నవంబర్ 26న అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది డీజీసీఏ. కానీ, ఆ తర్వాతి రోజే ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు పౌర విమానయాన శాఖ, డీజీసీఏ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఇంటర్నెషనల్ విమానాలపై బ్యాన్ అలాగే కొనసాగుతుందని ప్రకటించాయి. అయితే, ఎప్పటివరకు ఈ నిషేధం ఉంటుందనేది చెప్పలేదు. బుధవారం ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించాయి.