YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఫస్ట్ పేజి శకటాల ఎంపిక రాజకీయం..?

ఫస్ట్ పేజి శకటాల ఎంపిక రాజకీయం..?

హైదరాబద్, జనవరి 19,
అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు తమకు సమానమేనని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ, చాలా విషయాలలో వివక్ష కనబరుస్తోంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో ఓ రకంగా, బీజేపీయేతర ప్రభుత్వాలు ఏలుతున్న రాష్ట్రాల విషయంలో మరో రకంగా ప్రవర్తిస్తోంది. ఇందుకు తాజా దృష్టాంతం గణతంత్ర దినోత్సవం రోజున శకాటలపై కనబర్చిన వివక్ష. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చాలా రాష్ట్రాలకు అనుమతి నిరాకరించింది. విచిత్రమేమిటంటే మరికొద్ది వారాలలో ఎన్నికలను ఎదుర్కోబోతున్న రాష్ట్రాల విషయంలో ఎలాంటి కొర్రీలు పెట్టకుండా శకటాలకు ఓకే చెప్పడం. నిజానికి రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీలో వివిధ రాష్ట్రాల శకటాలను ప్రదర్శించడం సంప్రదాయం. తమ ప్రభుత్వాల తరఫున అమలు అవుతున్న పథకాలు, కార్యక్రమాలు, సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబించే విధంగా శకటాలను రూపొందించి ప్రదర్శనకు పంపుతాయి రాష్ట్రాలు. రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి గొప్పగా ఉన్న వాటిని ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక ఎలా జరుగుతుందనేది ఇప్పటికీ బ్రహ్మపదార్థమే. ఇష్టం వచ్చినట్టుగా ఎంపికలు జరుగుతున్నాయి.ఈ ఏడాది దాదాపు 15 రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల ప్రస్తావనే లేదు. బెంగాల్‌, కేరళ, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలకు మొండిచేయి చూపించింది కేంద్ర ప్రభుత్వం. మణిపూర్‌ మినహా త్వరలో ఎన్నికలు జరుగనున్న అయిదు రాష్ట్రాల శకటాలకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఓకే చెప్పేసింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి మొత్తం 56 ప్రతిపాదనలు వచ్చాయి. వాటిల్లో 21 నమూనాలను ఎంపిక చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌, హర్యానా, చత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, జమ్ముకశ్మీర్‌, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలతో పాటు, ఎడ్యుకేషన్‌-స్కిల్‌డెవలప్‌మెంట్‌, సివిల్‌ ఏవియేషన్‌, సమాచార-తపాలా, హోం, జలశక్తి, సాంస్కృతిక ఇలా తొమ్మది కేంద్ర ప్రభుత్వ శకటాలకు అనుమతి దొరికాయి. దక్షిణాదిలో కమలంపార్టీ అధికారంలో ఉన్న కర్నాటక తప్పితే మరే రాష్ట్రాలనికి చెందిన శకటాలకు అనుమతి ఇవ్వలేదు.తిరస్కరించిన విధాన్ని కేంద్రం సమర్థించుకున్న తీరే ఆశ్చర్యంగా ఉంది. దీనిపైన విమర్శలు వస్తున్నాయి. బెంగాల్‌, కేరళ, తమిళనాడు నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకుని ఆయన నెలకొల్పిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని గుర్తు చేస్తూ రూపొందించిన శకటాన్ని కేంద్రం కాదు పొమ్మంది. అసలు దీనిని ఎందుకు తిరస్కరించిందో ఎవరికీ అర్థం కావడం లేదు. బెంగాల్‌ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికి ఏకంగా ఓ లేఖే రాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా కేంద్రానికి ఓ ఘాటైన లేఖ రాశారు. శకటాన్ని తిరస్కరించి తమ రాష్ట్రాన్ని అవమానించారని కేరళ నేతలు మండిపడుతున్నారు. శకటాల ఎంపిక మార్గదర్శకాల ప్రకారమే జరిగిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మమత, స్టాలిన్‌లకు ప్రత్యుత్తరం కూడా ఇచ్చారు. ఎంత సమర్థించుకుంటున్నా కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కొన్ని రాష్ట్రాల శకటాలను అనుమతించలేదని అర్థమవుతోంది. కేరళనే తీసుకుందాం. ఆ ప్రభుత్వం ప్రచారరథంపై నారాయణ గురు బొమ్మ ఉండకూడదంటోంది కేంద్రం. ఉంటే తప్పేమిటన్నది కేరళ ప్రభుత్వం వాదన. నిజానికి నారాయణ గురు బొమ్మను కాదనడంలోనే కేంద్రం పెద్ద తప్పిందం చేసింది. నారాయణగురు ఓ సంఘ సంస్కర్త,. ఆధ్యాత్మిక గురువు. ఈళవ కులస్తులు ఆయనను దేవుడిలా కొలుస్తారు.ఓనం పండుగ తర్వాత వచ్చే ఈయన జయంతి వేడుకలను ప్రజలు గొప్పగా జరుపుకుంటారు. ఈళవ కులంలో పుట్టిన నారాయణగురు 21 ఏళ్ల వయసులో తిరువాన్కూర్‌ వెళ్లి వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం నేర్చుకున్నారు. నాలుగేళ్ల తర్వాత కేరళకు వచ్చి సొంతూరిలోనే ఓ పాఠశాల పెట్టి తను నేర్చుకున్న విద్యలన్నింటినీ పది మందికి నేర్పారు. ఏడేళ్ల తర్వాత అరువిపురం అనే ప్రాంతానికి వెళ్లి తపస్సు చేశాడు. 1888లో నదిలోంచి ఓ రాయి తీసి దాన్ని శివుడిగా ప్రతిష్టించి గుడి కట్టారు. ఆ గుడికి భక్తుల రాక ఎక్కువ కావడంతో కొందరు బ్రాహ్మణులకు కడుపు మండింది. ఏదో ఒక రాయిని ప్రతిష్టించి శివుడంటే ఎలా అని గొడవకు దిగారు. ఈయన బ్రాహ్మణ శివుడు కాదని, ఈళవ శివుడని నారాయణగురు జవాబు చెప్పేసరికి అక్కడ్నుంచి బ్రాహ్మణులు వెళ్లిపోయారు. 1903లో శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం అనే పీఠాన్ని స్థాపించారు. మనుషులందరికీ ఒకే కులమని, ఒకే మతమని, ఒకే ధర్మమని చెప్పే ఈ పీఠం ఇప్పటికీ ఉంది. పరయా, పులయార్‌ వంటి షెడ్యూల్‌ కులస్థులకు వేదాలు నేర్పించాడు నారాయణగురు. శివగిరిలో శారదామఠాన్ని స్థాపించారు. కేరళ, తమిళనాడు, కర్నాటక చివరికి శ్రీలంకలో కూడా ఈయన గుళ్లు కట్టించాడు. ఈ ఆలయాలలో విగ్రహ ప్రతిష్టాపన సంప్రదాయ పద్దతిలో కాకుండా భిన్నంగా జరిపించాడు. అస్పృశ్యతను నివారించడానికి ఎనలేని కృషి చేశాడు. గుళ్లలోకి అందరు కులస్తులను అనుమతించాలంటూ పెద్ద ఉద్యమమే చేశాడు. రవీంద్రనాథ్‌ టాగూర్‌, మహాత్మా గాంధీ, రమణ మహర్శి వంటి వారు ఈయనను అమితంగా గౌరవించేవారు. ఇలాంటి ఆయన బొమ్మ పెట్డడానికి ఎందుకు అభ్యంతరం? ఈయన చేసిన తప్పేమిటి? వర్ణ వివక్షత పాటించవద్దనడమా? వేదాలను ఇతర కులస్తులకు బోధించడమా? కేంద్రానికి ఆయన ఎందుకు పనికిరాకుండా పోయారో అర్థం అవ్వడం లేదు.పైగా ఆయన బొమ్మ ఎందుకు? ఆది శంకరాచార్య బొమ్మ పెట్టవచ్చు కదా అని జ్యూరీ సూచించడం అవివేకానికి పరాకాష్ట. నారాయణగురు ఎవరో, ఆయన ఎంత గొప్పవారో తెలుసుకునే తీరిక ఓపిక కేంద్రానికి లేవనుకుందాం? మరి నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ బొమ్మను ఎందుకు కాదన్నది? బెంగాల్‌ ఎన్నికల ముందు వరకు నేతాజీపై ఎక్కడాలేని ప్రేమను ఒలకబోసిన బీజేపీ ఆయన బొమ్మతో ప్రచారరథం పెడతానంటే ఎందుకు తిరస్కరించింది? అందుకు ఏ కారణం చెబుతుంది? జర్మనీలో ఉంటున్న నేతాజీ కూతురు అనితా బోస్‌ కూడా రిపబ్లిక్‌ డే ఉత్సవాల్లో నేతాజీకి గుర్తుగా రూపొందించిన శకటం లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. తమిళనాడు విషయంలోనూ ఇదే తప్పిదం చేసింది కేంద్రం. చిదంబరం పిళ్ల బొమ్మ పెడితే కుదరంటోంది. నిజానికి నౌకా వ్యాపారంపై బ్రిటిషర్ల ఆధిపత్యం నడుస్తున్న రోజుల్లోనే ఈయన స్వదేశీ షిప్పింగ్‌ సంస్థ పెట్టారు. అలా బ్రిటిషర్లకు సవాల్‌ విసిరాడు. చిదంబరం పిళ్ల బొమ్మను కాదనడానికి బలమైన కారణమేమిటో కేంద్రం చెప్పలేకపోతున్నది. తమ మిత్రపక్షమైన అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం నాలుగేళ్ల పాటు తమిళనాడు ప్రచారరథాన్ని అనుమతించిన బీజేపీ ఇప్పుడు డీఎంకే అధికారంలోకి రాగానే చిదంబరం పిళ్ల. మహాకవి భారతి, రాణివేలు నాచ్చియార్‌, మరుదు సోదరుల బొమ్మలతో కూడిన టెబ్లోను రూపొందిస్తే కాదనేసింది. కేంద్ర నిర్ణయం పట్ల బెంగాల్‌, తమిళనాడు, కేరళలలోని అధికారపక్షాలే కాదు, విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. కేరళలో లెఫ్ట్‌, కాంగ్రెస్‌లు అడుగుతున్న ప్రశ్నలకు అక్కడి బీజేపీకి ఏం జవాబివ్వాలో తెలియడం లేదు. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందనంటే వచ్చే ఎన్నికల్లో ఈ మాత్రం ఓట్లు కూడా రావన్న భయం. మొత్తం మీద శకటాల ఎంపిక మాత్రం సరిగ్గా జరగలేదని, ఇందులో రాజకీయాలు చోటు చేసుకున్నాయని అర్థమవుతోంది

Related Posts