న్యూఢిల్లీ, జనవరి 19,
సానియా మీర్జా టెన్నిస్ నుంచి రిటైర్ కాబోతోంది. 2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్)లో ఓటమి తర్వాత సానియా మీర్జా ఈ విషయాన్ని వెల్లడించింది. సానియా, ఉక్రెయిన్ భాగస్వామి నదియా కిచ్నోక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్‌సెక్-కాజా జువాన్ జోడీ 4-6, 6-7(5)తో గంటా 37 నిమిషాల్లో ఓటమి చవిచూశారు. అయితే సానియా ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి ఈ గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో పాల్గొంటుంది.సానియా మీర్జా మాట్లాడుతూ, ‘ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్నాను. నేను మొత్తం సీజన్‌లో ఆడగలనో లేదో తెలియదు. కానీ నేను మొత్తం సీజన్‌లో ఉండాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. సానియా భారతదేశపు అత్యంత విజయవంతమైన మహిళా టెన్నిస్ క్రీడాకారిణి. మహిళల డబుల్స్‌లో ఆమె నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంది. కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించింది. వీటిలో మూడు టైటిల్స్ మహిళల డబుల్స్, మూడు మిక్స్‌డ్ డబుల్స్‌లో గెలుచుకుంది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో, 2012లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో యూఎస్ ఓపెన్. మహిళల డబుల్స్‌లో 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ట్రోఫీలు సాధించింది.2013లో సానియా సింగిల్స్ ఆడటం మానేసింది. అప్పటి నుంచి ఆమె డబుల్స్‌లో మాత్రమే ఆడుతోంది. సింగిల్స్‌లో ఆడుతున్నప్పుడు కూడా సానియా చాలా విజయాలు సాధించింది. ఆమె చాలా మంది పెద్ద టెన్నిస్ క్రీడాకారులను ఓడించి 27వ ర్యాంక్‌కు చేరుకుంది.కొడుకు పుట్టిన తర్వాత రెండేళ్లు టెన్నిస్‌కు దూరం.. దాదాపు 91 వారాల పాటు డబుల్స్‌లో సానియా మీర్జా నంబర్‌వన్‌గా కొనసాగింది. 2015లో మార్టినా హింగిస్‌తో జతకట్టడం ద్వారా సానియా వరుసగా 44 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి ఈవెంట్లలో కూడా పతకాలు సాధించింది. సానియా మీర్జా తన కొడుకు పుట్టిన తర్వాత 2018లో టెన్నిస్ కోర్టుకు దూరమైంది. ఆ తర్వాత రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చింది. తిరిగి వచ్చేందుకు సానియా తన బరువును దాదాపు 26 కిలోలు తగ్గించుకుంది. ఆమె తిరిగి వచ్చిన తర్వాత, ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిచెనోక్‌తో కలిసి హోబర్ట్ ఇంటర్నేషనల్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. దీని తర్వాత ఆమె టోక్యో ఒలింపిక్స్ 2020లో కూడా ఆడింది. కానీ, అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.