హైదరాబాద్, జనవరి 20,
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి ఉగ్రవాద ముప్పు ఉందని మంగళవారం ఐబీ హెచ్చరించింది. బుధవారం కల్లా పార్టీ ఆఫీసుకు సెక్యూరిటీ పెంచేశారు పోలీసులు. హైదరాబాద్ అత్యంత సురక్షితమని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతుంటే.. సడెన్‌గా బీజేపీ ఆఫీస్ టెర్రర్ టార్గెట్‌గా ఎలా మారింది? నగరంలో ఉగ్రమూకలు మకాం వేశాయా? మరేదైనా.. రాజకీయ మతలబు నడుస్తోందా? అనే అనుమానమూ వ్యక్తం అవుతోందని అంటున్నారు.నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి ఉగ్రముప్పు వార్తల నేపథ్యంలో పోలీసులు భద్రత పెంచారు. పార్టీ కార్యాలయాన్ని పోలీసులు పరిశీలించారు. ఆఫీసులో భద్రతా లోపాలను సరిచేసుకోవాలని సిబ్బందికి సూచించారు. పార్టీ ఆఫీస్ దగ్గర నిరంతరం సీఐ స్థాయి అధికారితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ ఆఫీస్ ముందు వాహనాలు నిలపరాదని పోలీసులు ఆదేశించారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అలెర్ట్ చేయాలని కార్యాలయ సిబ్బందికి సూచించారు. జనవరి 26 వరకు ఆఫీసు సిబ్బంది అలెర్ట్‌గా ఉండాలని పోలీసులు ఆదేశించారు. తెలంగాణ బీజేపీ ఆఫీసనే కాదు.. రిపబ్లిక్ డే వేడుకలే టార్గెట్‌గా పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద సంస్థలు రంగంలోకి దిగాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వింగ్ అలర్ట్ చేసింది. రిపబ్లిక్ పరేడ్‌లో ప్రధాని మోదీ లక్ష్యంగా డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. రిపబ్లిక్ డే వేడుకలతో పాటు.. దేశంలోని పలు బీజేపీ కార్యాలయాలు, ఆ పార్టీ ప్రముఖులకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని సూచించింది. అందులో భాగంగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికీ ప్రమాదం లేకపోలేదనేది ఐబీ రిపోర్ట్. ఇలా ఐబీ హెచ్చరించిందో లేదో.. అలా తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసుకు భద్రత కట్టుదిట్టం చేశారు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు డ్యామేజ్ జరుగుతుందనో.. లేక, బీజేపీని నిత్యం న్యూస్‌లో ఉంచే ఎత్తుగడో.. కారణం ఏదైనా కేసీఆర్ సర్కారు శరవేగంగా స్పందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.