హైదరాబాద్, జనవరి 20,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’కు జాతీయ రాజకీయాలపై చాలా చాలా ఆశలు,ఆకాంక్షలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఆయనే పలు సందర్భాలలో బయట పెట్టారు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టి దేశం దశా దిశా మార్చేస్తానని శపధాలు సైతం చేశారు. అయితే, ఎందుకనో గానీ, ఆయన మాటలు కోటలు దాటినా, చేతలు మాత్రం.. ఇంతవరకు గడప దాట లేదు. అదలా ఉంటే ఇప్పుడు అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో బీజేపీతో కయ్యం ముదురుతున్న నేపద్యంలో కేసీఆర్ మళ్ళీ, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే ప్రయత్నాలను జోరుగా సాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చెన్నై వెళ్ళి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్’తో సమావేశమై వచ్చారు. అలాగే, రాష్ట్రానికి వచ్చిన సిపిఐ, సిపిఎం నాయకులతోనూ మంతనాలు సాగించారు. ఆర్జేడి నాయకుడు తేజస్వి యాదవ్’ కూడా ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కలిసి వెళ్ళారు. అంతకు ముందే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్,ఇతర జాతీయ ప్రాంతీయ పార్టీల నాయకులతోనూ ఆయన జాతీయ స్థాయిలో ప్రాంతీయ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చలు జరిపారు. మరో వంక తెరాస నాయకులు ఇంకేముంది, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలగడం ఖాయమన్న రీతిలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే, ఇటీవల ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ యువర్ కేటీఆర్’ అనే ట్యాగ్‌లైన్‌తో నెటిజన్లతో ముచ్చటించిన మంత్రి కేటీఆర్ తనకు మాత్రం జాతీయ రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని తేల్చేశారు. ‘జాతీయ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి.? మిమ్మల్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా చూడాలని ఉంది” అంటూ ఎవరో చేసిన ట్వీట్ పై స్పందించిన త్రి కేటీఆర్ ., ‘తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తూ సంతోషంగా ఉన్నాను’ అని క్లుప్తంగా సమాధానమిచ్చారు. అంటే,తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని పరోక్షంగానే అయినా కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇలా ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద మనసు పారేసుకుని, బీజేపీ, వ్యతిరేక జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను ఇంటికి విందుకు పిలిచి మరీ ప్రత్యాన్మాయంగా ఫ్రంట్ కట్టే ఆలోచన చేస్తున్న సమయంలోనే కేటీఆర్ చేసిన తాజా కామెంట్ రాజకీయ వర్గాల్లో వేడి వేడి చర్చకు దారితీసింది అయితే, కేసీఆర్, కేటీఆర్ మాటలు వేరైనా , ఇద్దరి అలోచన ఒకటే అని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేటీఆర్’ అర్జెంటుగా ముఖ్యమంత్రి కావాలంటే, కేసీఆర్ అంతే అర్జెంటుగా రాష్ట్రం వదిలి వెళ్ళాలి.. అందుకే ఆయన అలా .. ఈయన ఇలా ఒకే ఆలోచనను.. ఎవరికీ వీరు వారి ఆకాంక్షను వ్యక్తం చేశారని అంటున్నారు. ఇదలా ఉంటే. బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలు, భావసారూప్య పార్టీలతో మంతనాలు జరుపుతున్న కేసీఆర్.. జాతీయస్థాయిలో ప్రజాస్వామిక, లౌకిక శక్తుల ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పేందుకు హైదరాబాద్ వేదికగా సదస్సు నిర్వహించే ఆలోచన చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ సమావేశం ఉంటుందని అంటున్నారు. అయితే గతంలో కూడా అసెంబ్లీ ఎన్నిక్లలకు ముందు ఇలాగే, కేసీఆర్ హడావిడి చేశారు. అయితే ఆ తర్వాత ఆ విషయమే మరిచి పోయారు ..సో ఈసారి అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సాహసం చేస్తారా .. లేక .. వ్యవసాయ చట్టాలు, వరి కొనుగోలు విషయంలో ఢిల్లీ వెళ్లి వచ్చి, స్వరం మార్చిన విధంగా మళ్ళీ స్వరం మారుస్తారా అనేదిచూడవలసి వుందని సొంత పార్టీలోని నాయకులే అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.