విజయవాడ, జనవరి 20,
ఉప్పు..నిప్పులా ఉండే ఆ రెండు కుటుంబాల మధ్య రెండున్నర దశాబ్దాలుగా సఖ్యత లేదు. పేరుకు తోడల్లుళ్లు అయినా.. ఎవరి రాజకీయం వారిదే. కుటుంబ కార్యక్రమాల్లోనూ పెద్దగా కలిసింది లేదు. ఇటీవలే ఆ ఇద్దరు ఓ కార్యక్రమంలో కలుసుకుని.. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే.. సంక్రాంతి పండక్కి చాలాఏళ్ల తర్వాత ఓ అక్క ఇంటికి తమ్ముడొచ్చాడు. ఆ తమ్ముడి సందడి సంక్రాంతికే పరిమితమా.. లేక ఇద్దరు బావలను కలపటం కోసమా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నే హాట్ టాపిక్.దగ్గుబాటి వెంకటేశ్వరరావు. మామ ఎన్టీఆర్‌తో కలిసి రాజకీయంగా అడుగులు వేశారు. మాజీ సీఎం చంద్రబాబు కంటే టీడీపీలో సీనియర్. ఉమ్మడి ఏపీలో దగ్గుబాటి అండతోనే టీడీపీలో రాజకీయంగా పైకి ఎదిగిన నేతలు ఎందరో. ఎన్టీఆర్ నిష్క్రమణ తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. 2004, 2009లో ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి లోక్‌సభ, మరోసారి రాజ్య సభ సభ్యునిగా పనిచేశారు. మారిన పరిణామాలతో 2019లో వైసీపీలో చేరి పర్చూరులో పోటీచేసి తొలిసారి ఓడిపోయారు. కొన్ని రోజులు వైసీపీలో యాక్టివ్‌గానే ఉన్నా తర్వాత వైసీపీకి దూరంగా ఉన్నారు.భర్త అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరి 2004లో బాపట్ల, 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు పురందేశ్వరి. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. 2019లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరే సమయానికి పురందేశ్వరి బీజేపీలో ఉండటం.. తరచూ ఆమె వైసీపీని విమర్శించడం కొంత వివాదానికి దారితీసింది. చివరకు ఇద్దరూ చేరో పార్టీలో ఉంటూ ఒకరు పార్టీని విమర్శించటం సరికాదని వైసీపీ పెద్దలు చెప్పారట. దాంతో పురందేశ్వరిని యాక్టివ్ పాలిటిక్స్‌లో కొనసాగించాలని భావించి.. ఆయన పాలిటిక్స్‌కు దూరంగా ఉండిపోయారు.బాలకృష్ణకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిలు స్వయానా అక్కాబావలు. తన తోబుట్టువులతో అత్యంత సన్నిహితంగా ఉండే బాలకృష్ణ.. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున కారంచేడులో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అప్పటి పర్చూరు టీడీపీ అభ్యర్ది గొట్టిపాటి నరసయ్య తరఫున ప్రచారం చేస్తూ ఫ్లో లో నోరు జారారు. తనకు ఎవరైనా ఒకటే అని అక్క ఇంటి ముందే తొడకొట్టారు. అప్పట్లో బాలయ్య తీరు రచ్చ రచ్చ అయింది. ఎంత రాజకీయాల్లో ఉన్నా కుటుంబానికి విలువ ఇచ్చే బాలకృష్ణ.. సొంత అక్క ఇంటి ముందు తొడకొట్టడం సరైంది కాదనే వాదన వినిపించింది. సీన్ కట్‌చేస్తే బాలకృష్ణ కుటుంబ సమేతంగా ఈ సంక్రాంతికి అక్క పురందేశ్వరి ఇంటికి వచ్చారు.పండగ మూడు రోజులూ అక్క ఇంటి దగ్గరే ఉన్నారు బాలయ్య. ఓ రోజు గుర్రమెక్కారు. మరో రోజు ఎద్దుల బండిని నడిపారు. సముద్ర తీరంలో టాప్ లెస్ జీపులో హుషారుగా తిరిగారు. ఎప్పుడు పురందేశ్వరి ఇంటికి వచ్చినా.. వచ్చామా.. వెళ్లామా అన్నట్టుగా సాగే బాలకృష్ణ కార్యక్రమం ఈసారి ఆద్యంతం అందిరికీ తెలిసేలా సాగింది. ఎన్నడు లేని విధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా బాలయ్య సందడిని వీడియో తీస్తూ కనిపించారు. ఆయనే స్వయంగా పలువురికి ఆ వీడియోలను పంపించారట. కరోనా వల్ల ఎవరినీ ఇంట్లోకి అనుమతించకపోవడంతోనే వీడియోలు విడుదల చేశామని చెబుతున్నప్పటికీ అందులో ఏమైనా ఆంతర్యం ఉందా విశ్లేషకులు ఆరా తీస్తున్నారట. ఏ కార్యక్రమం చేసినా.. రాజకీయ నిర్ణయం తీసుకున్నా గోప్యంగా ఉండే దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. పండక్కి వచ్చిన బాలకృష్ణ పర్యటన మొత్తం అందరికీ తెలిసేలా చేయటం వెనక కథేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.టీడీపీలో మొదటి నుంచీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు దారులు వేరు. రెండు గ్రూపుల్లో ఉండేవారు. ఎన్టీఆర్ మరణానంతరం విభేదాలతో దగ్గుబాటి.. ఆయన తోడల్లుడు చంద్రబాబు చెరోదారి అయ్యారు. రాజకీయంగా కూడా మరింత ప్రత్యర్దులుగా మారారు. అప్పటి నుండి కుటుంబ కార్యక్రమాల్లో కూడా ఇద్దరూ కలిసిన దాఖలాలు లేవు. అలాంటిది చంద్రబాబు, దగ్గుబాటి ఇటీవల ఓ కుటుంబ కార్యక్రమంలో కలిశారు. ఇద్దరు ఓచోట చేరి.. కాసేపు మాట్లాడుకున్నారు. కలసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అప్పటి నుండి ఇద్దరూ కలిసి పోతారనే టాక్ ప్రారంభమైంది. దీనికి ఊతమిచ్చేలా బాలకృష్ణ అన్నీ కార్యక్రమాలను మార్చుకుని కారంచేడులో అక్క పురందేశ్వరి ఇంట్లోనే మకాం వేయటంతో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. టీడీపీ క్రియాశీలకంగా మారి.. అంతా కలిస్తేనే ప్రత్యర్థిపై గెలుపు సొంతం అవుతుందన్న చర్చ జరుగుతోంది. అందుకే నందమూరి కుటుంబం మధ్య లుకలుకలు లేకుంటేనే పార్టీ నిలబడుతుందని బాలకృష్ణ నడుం బిగించి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. పైగా చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి జరిగిన రగడంలో పురందేశ్వరి సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అదే అక్క ఇంటికి బాలయ్య రావడం.. తీరిక చేసుకుని నాలుగు రోజులు ఉండటం వెనక ఆంతర్యం ఏంటన్నది విశ్లేషకుల ప్రశ్న.దగ్గుబాటిని తిరిగి టీడీపీలోకి తీసుకొచ్చే చర్చలు మొదలయ్యాయా? అనే సందేహాలు ఉన్నాయట. టీడీపీ సంక్షోభ సమయంలో దగ్గుబాటికి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారన్న ప్రచారం సాగింది. కానీ, ఆ రెండు భాద్యతలను చంద్రబాబే తీసుకున్నారు. అది కూడా రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితికి తీసుకొచ్చిందని చెబుతారు. బాలకృష్ణ టీడీపీలో చురుకుగా ఉండటం కూడా వారి మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటూ వచ్చాయి. ఇప్పుడు కారంచేడుకు బాలయ్య వస్తే.. బామ్మర్ది వెళ్లేవరకు బావ దగ్గుబాటి వెంటే ఉన్నారు. నందమూరి కుటుంబంలోని మరికొందరు ముఖ్యులు కూడా వచ్చారు. దీంతో బాలయ్య సంక్రాంతి కోసమే కారంచేడు వచ్చారా.. లేక దగ్గుబాటిని టీడీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నమా? నందమూరి.. దగ్గుబాటి కుటుంబాలతో నారా కుటుంబం కూడా కలసిపోయి.. అందరూ ఒకే గూటికి వస్తారా అన్న చర్చ మొదలైంది. మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆలోచనలు ఏంటో? చంద్రబాబుతో కలిసి అడుగులు వేస్తారో లేదో చూడాలి