విజయవాడ, జనవరి 20,
గుడివాడ.. ఇదో బ్రాండ్ నేమ్.. మహామహులకు పుట్టినిల్లు.. చైతన్య సాహితీ వికాసాల ఘనకీర్తి.. జాతిపిత పూజ్య బాపూజీ నడయాడిన నేల.. సినీ వినీలాకాశంలో ధ్రువతారలు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఘంటసాల పురిటిగడ్డ గుడివాడ. నక్సలైట్ ఉద్యమ నేత కొండపల్లి సీతారామయ్యదీ ఇదే నేల. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి హోమియో కళాశాల నెలకొల్పిందీ ఇదే గుడివాడలోనే. వ్యవసాయ సంబంధ పరికరాల తయారీకి మారుపేరు కూడా ఈ గుడివాడదే.. అంతటి ఘన చరిత్ర ఉన్న గుడివాడ ప్రాభవం ఇప్పుడు మసకబారిపోతోందని స్థానికుల్లో ఆవేదన పెరిగిపోతోంది. గాంధీ నడయాడిన గడ్డ ఇప్పుడు జూదాలు, పేకాటలు, క్యాసినోలు, బూతులకు చిరునామాగా మారిపోయి, అపకీర్తిని మూటగట్టుకుంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కృష్ణా జిల్లాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన గుడివాడ.. రాజకీయ, సినీ రంగాలకు ఎందరో మహామహులను అందించిన గడ్డ. వారంతా గుడివాడకు ప్రపంచ స్థాయిలో ఘన కీర్తి తెచ్చిపెట్టారు. ఇప్పుడదే గుడివాడను ‘బూతుల నేత ఊరేనా?.. పేకాటలు, గోవా తరహా క్యాసినోలు నడిచిందక్కడే కదా’ అని గుర్తు చేసుకోవాల్సిన దుస్థితికి తెచ్చారు గుడివాడ నేతలు అంటూ స్థానికులు నోళ్లు నొక్కుకుంటున్నారు.
ఒకప్పుడు గుడివాడ.. ‘విదర్భపురి’ పేరుతో భాసిల్లింది. అనేక గుడులు ఉన్న ఈ నేల గుడులవాడగా ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా అది గుడివాడగా మారింది. వర్తక, వాణిజ్యాలు, విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులతో విలసిల్లింది గుడివాడ. వాస్తవానికి కృష్ణా జిల్లా రాజకీయం మొత్తం గుడివాడ చుట్టూనే తిరిగేదంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీని మూడుసార్లు ఆకర్షించింది గుడివాడ గడ్డ. ఇక్కడి ప్రజల స్వాతంత్ర్యోద్యమ చైతన్యాన్ని చూసి ముగ్ధుడైన గాంధీజీ 1921, 1923, 1933 సంవత్సరాల్లో గుడివాడ వచ్చారు. గాంధీ స్ఫూర్తితో గుడివాడ వాసి గూడూరి రామచంద్రుడు హరిజనాశ్రమం నిర్మించారు. ఈ విషయం గాంధీజీయే స్వయంగా 1921లో ‘యంగ్ ఇండియా’ పత్రికలో ప్రత్యేకంగా ప్రస్తావించడం గుడివాడ విశేషం.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, నటరత్న ఎన్టీ రామారావు పుట్టింది గుడివాడ నియోజకవర్గంలోని నిమ్మకూరులో. 1983లో తన రాజకీయ ఆరంగేట్రం చేసింది కూడా గుడివాడ శాసనసభా స్థానం నుంచే. 1985లో ఎన్టీఆర్ గుడివాడ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ తన హయాంలో గుడివాడ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుదీ గుడివాడ ప్రాంతం నందివాడ మండలం వెంకట రాఘవాపురంలో పుట్టారు. గుడివాడలో ఆయన సమకూర్చిన నిధులతో ఏఎన్నార్ పేరుతో ఓ డిగ్రీ కళాశాల నడుస్తోంది. ఇక అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఇదే నియోజవర్గం చౌటపల్లిలో జన్మించారు. ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ కూడా ఈ ప్రాంతం నుంచి వెండితెరకు పరిచయం అయ్యారు.తొలి తరం మావోయిస్టు ఉద్యమ నేత కొండపల్లి సీతారామయ్య, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, సినీ ఫొటోగ్రాఫర్ వీఎస్సార్ స్వామి, సినీ గేయాలకు సాహిత్యశోభ అద్దిన మల్లాది, విద్యుత్ రంగ నిపుణుడు నార్ల తాతారావు, ప్రసిద్ధ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు గుడివాడ నియోజకవర్గంలో జన్మించినవారే. బౌద్ధ వాంగ్మయ బ్రహ్మ దుగ్గిరాల బలరామకృష్ణయ్య, ప్రసిద్ధ సినీ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం, కె.ప్రత్యగాత్మ, దుక్కిపాటి మధుసూదన్ రావు, ప్రముఖ చిత్రకారుడు ఎస్వీ రామారావు, సాహితీవేత్త త్రిపురనేని హనుమాన్ చౌదరి కూడా గుడివాడ వారే.ఇంతటి ఘన చరిత్ర ఉన్న గుడివాడ కీర్తి ఇప్పుడు మసకబారిపోతోందే అనే ఆవేదన స్థానికుల్లో ఎక్కువైపోతోంది. నోరు విప్పితే బూతులు మాట్లాడే నేత.. జూదగృహాలు, క్యాసినోలు, భూ కబ్జాలు, గడ్డం గ్యాంగులు గుడివాడ ఘన చరిత్రను దిగజారుస్తున్నాయని ప్రతి ఒక్కరిలో అసంతృప్తి రగిలిపోతోంది. సరదాల సంక్రాంతి పండుగ నెపంతో విదేశీ క్యాసినో సంస్కృతిని దిగుమతి చేసుకున్న నగరం అని ఇప్పుడు జనం నోళ్లలో నానిపోతోంది గుడివాడ. పచ్చని పొలాలు, చల్లటి చెరువుగట్లు, శుభ కార్యాలతో కళకళలాడే ఫంక్షన్ హాళ్లతో ఉండే గుడివాడలో ఇప్పుడవన్నీ రాజకీయ పెద్దల మద్దతుతో పేకాటలు, గుండాటలకు నిలయాలుగా మారిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది.