న్యూ డిల్లీ జనవరి 20
ఎంఎల్ఏలను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయటం రాజ్యాంగ విరుద్ధమే అంటు సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మహారాష్ట్రలో 12 మంది బీజేపీ ఎంఎల్ఏలను ఏడాదిపాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. దాన్ని ఎంఎల్ఏలు సుప్రింకోర్టులో చాలెంజ్ చేశారు. రెండు వైపుల వాదనలు విన్న తర్వాత ఫైనల్ గా సుప్రీంకోర్టు తీర్పు చెబుతు ఏడాదిపాటు సస్పెండ్ చేయటం కుదరదని చెప్పేసింది. నియోజకవర్గంలో ఆరు మాసాలకు మించి ప్రజా ప్రతినిధి లేనపుడు ఉప ఎన్నికలు వస్తాయన్న విషయాన్ని గుర్తు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఆరుమాసాల గడువుపై ఉప ఎన్నికలు నిర్వహించాలని ఉన్నప్పుడు ఎంఎల్ఏని స్పీకర్ ఏడాదిపాటు ఎలా సస్పెండ్ చేస్తారంటు నిలదీసింది. చట్టసభల నిర్ణయాల్లో కోర్టులో జోక్యం చేసుకునేందుకు లేదన్న వాదన కూడా సరికాదన్నది. చట్టసభలు తీసుకునే నిర్ణయాలు సరిగా లేనప్పుడు కోర్టులు కచ్చితంగా జోక్యం చేసుకుంటాయని కూడా చెప్పేసింది. ఒక సభ్యుడిని స్పీకర్ సస్పెండ్ చేయాలని అనుకుంటే ఆ సమావేశాల వరకు మాత్రమే చేయాలని కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గతంలో ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎంఎల్ఏ రోజా సస్పెన్షన్ విషయానికి కూడా వర్తింస్తుందనే అనుకోవాలి. అప్పట్లో స్పీకర్ కోడెల శివప్రసాద్ వైసీపీ ఎంఎల్ఏని ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని రోజా హైకోర్టులో చాలెంజ్ చేశారు. కోర్టు కూడా స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అయినా తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు కోడెల అంగీకరించలేదు. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి తదితరుల విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే అదే సుప్రీంకోర్టు ఇపుడు మహారాష్ట్రలోని బీజేపీ ఎంఎల్ఏల సస్పెన్షన్ పై స్పష్టమైన తీర్పిచ్చింది. అప్పట్లో కోడెల కూడా సభ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. అంటే అది కూడా తప్పే అని ఇప్పటి తీర్పు ద్వారా అర్ధమవుతోంది. బలముందని అధికారపార్టీ సభ్యులు తీర్మానాలు చేయటం దాన్ని స్పీకర్ అమలు చేయటం కుదరదని సుప్రింకోర్టు తాజా తీర్పుతో స్పష్టమైంది. ఏ నిర్ణయమైనా తీసుకునేటపుడు కాస్త ముందు వెనక ఆలోచించాలన్నది సుప్రింకోర్టు తాజా తీర్పు.