YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అయోధ్య నుంచి యోగీ..

అయోధ్య నుంచి యోగీ..

లక్నో, జనవరి 21,
యూపీలో రాజకీయ వేడి రాజుకుంది. త్వరలో జరగబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. మళ్ళీ అధికారమే పరమావధిగా అడుగులు వేస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీచేయనున్నారా..? ఇంతకూ యోగీని అయోధ్యనుంచే పోటీకి దించాలని బీజేపీ నేతలు ఎందుకు భావిస్తున్నారు…? యోగీ, అయోధ్య స్థానానికి మారడం.. సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనుంది.?అనేది యావత్ భారతాన చర్చనీయాంశంగా మారింది.యూపీ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి సత్తా చాటేందుకు బీజేపీ అన్ని వ్యూహాల్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్.. అయోధ్య నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని త్వరలోనే పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. యోగి అయోధ్య అసెంబ్లీ స్థానంలో పోటీకి దిగితే, అది పార్టీకి పూర్తి సానుకూలంగా పరిణమిస్తుందని నేతలు భావిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య బరిలో నిలపాలన్న బీజేపీ వ్యూహం వెనుక ఐదు కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. రామాలయ నిర్మాణం, యోగీపై హిందుత్వ నేతగా ముద్ర, అవధ్‌పై ప్రభావం, ఓటర్లకు స్పష్టమైన సందేశం, అయోధ్య బీజేపీకి అత్యంత ముఖ్యమైనదన్న సంకేతాన్ని జనంలోకి పంపించడంగా తెలుస్తోంది.దాదాపు 500 ఏళ్ళనాటి సమస్యకు సుప్రీంకోర్టు తీర్పుతో పరిష్కారం లభించింది. తర్వాత రామాలయ నిర్మాణం వేగంగా జరుగుతోంది. దీంతో రాజకీయంగా బీజేపీకి సానుకూలత కనిపిస్తోంది. సంఘ్ పరివార్‌కు ఇది కేంద్ర స్థానం కావడం కూడా మరొక కారణం. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని గోరఖ్‌నాథ్ పీఠానికి, అయోధ్యకు అవినాభావ సంబంధం ఉంది. యోగి ఆదిత్యనాథ్ గురువులు మహంత్ అవైద్యనాథ్, మహంత్ దిగ్విజయనాథ్ తమ తమ కాలాల్లో రామాలయం ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1949లో రామ జన్మభూమి ఉద్యమంలో మహంత్ దిగ్విజయనాథ్ ప్రముఖ పాత్ర పోషించారు.యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య నుంచి పోటీ చేయించడం వల్ల బీజేపీ హిందుత్వ భావజాలం మరింత బలోపేతమవుతుంది. ఫలితంగా బీజేపీ హిందుత్వ నేతగా ఆయనకు మరింత ఎక్కువ గుర్తింపు లభిస్తుందని భావిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని అవధ్ ప్రాంతంలో అయోధ్య ఉంది. ఈ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీకి మంచి పట్టు ఉంది. అయోధ్య నుంచి యోగి పోటీ చేస్తే ఈ ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలపై ప్రభావం పడుతుంది. దీనివల్ల పార్టీ లాభపడుతుందని బీజేపీ భావిస్తోంది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పవిత్ర పుణ్య క్షేత్రం వారణాసి నుంచి పోటీ చేసి, గొప్ప అనుబంధాన్ని ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా యోగి కూడా అయోధ్య నుంచి పోటీ చేస్తే, ఆ నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధాన్ని చాటవచ్చు. అయోధ్య నియోజకవర్గం బీజేపీకి చాలా ముఖ్యమైన స్థానం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అయోధ్యపై యోగి ప్రత్యేక దృష్టి సారించారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. రోడ్ల విస్తరణ, స్నాన ఘట్టాల సుందరీకరణ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అయోధ్యను ఎంచుకోవడం వెనుక పక్కా వ్యూహం వుందంటున్నారు విశ్లేషకులు.

Related Posts