విజయనగరం, జనవరి 21,
కిల్లి కృపారాణి పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే అదేమి చిత్రమో కాని ఆమె అనుకున్నప్పుడు ఎటువంటి పదవి దక్కడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతుంది. మూడేళ్లవుతున్నా ఆమెకు ఎటువంటి పదవి దక్కకపోవడంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలయింది. తొలుత ఎమ్మెల్సీ పదవి కిల్లి కృపారాణికి వస్తుందనుకున్నారు. కానీ అదే జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ వంటి వారికి లభించాయి. కిల్లి కృపారాణికి దక్కలేదు. ఇక కిల్లి కృపారాణికి రాజ్యసభ పదవి దక్కుతుందని భావించారు. వచ్చే మార్చిలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తాను గతంలో పార్లమెంటు సభ్యురాలిగా ఉండటంతో జగన్ తనకు రాజ్యసభ అవకాశమిస్తారని భావించారు. కానీ రానున్న కాలంలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలకు ముందుగానే అభ్యర్థులు ఖరారయ్యారంటున్నారు. జగన్ కొందరికి నేరుగా హామీ ఇవ్వడం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో రాజ్యసభ పదవుల ఎంపిక ఉండనుండటంతో ఈసారి కూడా కిల్లి కృపారాణికి పెద్దల సభలో చోటు దక్కడం కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో టాక్ బలంగా వినపడుతుంది. 2024 ఎన్నికలలో కిల్లి కృపారాణిని శ్రీకాకుళం పార్లమెంటుకు పోటీ చేయించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని తెలిసింది. అక్కడ బలమైన అభ్యర్థి కిల్లి అని జగన్ అంచనా వేస్తున్నారు. కింజారపు రామ్మోహన్ నాయుడును ధీటుగా ఎదుర్కొనడానికి మరొక అభ్యర్థి లేరని ఆలోచనలో ఉన్నారు. కింజారపు కుటుంబాన్ని ఎదుర్కొనాలంటే బలమైన అభ్యర్థిని నిలబెట్టాలన్న ధ్యేయంతో ఉన్నారు.