హైద్రాబాద్, జనవరి 21,
యాసంగి సాగు తగ్గడంతో ఈసారి విద్యుత్ డిమాండ్ పడిపోయింది. నిరుడు రికార్డు స్థాయిలో 68.14 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు జరగ్గా ఈసారి అందులో సగం కూడా సాగయ్యే పరిస్థితి లేదు. దీంతో నిరుటి కంటే మూడు వేల మెగావాట్ల కరెంటు వాడకం తగ్గింది. కిందటేడు యాసంగి సాగు పెరిగినా, కరోనా ఎఫెక్ట్తో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలన్నీ మూతపడడంతో కరెంటు వాడకం తక్కువుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకున్నా విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గడం గమనార్హం. దీనికి తోడు వాతావరణం చల్లబడడం ఇటీవల వడగండ్ల వానలు, అకాల వర్షాలతో కరెంటు వాడకం కొంత తగ్గింది. వారం రోజులుగా 10వేల మెగావాట్‌ల లోపే కరెంటు డిమాండ్ ఉంది. పొద్దున తప్పితే ఏటైమ్‌లోనైనా కరెంటు డిమాండ్ ఆరేడు వేల మెగావాట్లే ఉంటోంది. మంగళవారం సాయంత్రం డిమాండ్ అత్యంత తక్కువగా 4930 మెగావాట్లు నమోదైంది.రాష్ట్రంలో బోరు బావుల కింద వరి సాగు అత్యధికంగా జరుగుతుంది. అధికారికంగా 25.78 లక్షల కరెంటు మోటర్ల కనెక్షన్‌లు ఉన్నాయి. కరెంటు సరఫరాలో 30శాతానికి పైగా అగ్రికల్చర్ వాడకం ఉంటుంది. నిరుడు యాసంగి సాగు 68.14లక్షల ఎకరాలు. వరి వేస్తే ఉరే అంటూ రాష్ట్ర సర్కారు ఈ సారి ఆంక్షలు పెట్టడంతో రైతులంతా డైలమాలో పడ్డారు. దీంతో ఇప్పటి ఇవరకు 15 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. ఇందులో వరి సాగు 5లక్షల ఎకరాలకు మించలేదు. ఫలితంగా విద్యుత్ వినియోగం భారీగా తగ్గిపోయింది. వారం రోజులుగా ఏ ఒక్క రోజు కరెంటు డిమాండ్ 10వేల మెగావాట్లు దాటడం లేదు. నిరుడు ఇదే నెల 26న అత్యధికంగా 13452 మెగావాట్ల కరెంటు డిమాండ్ నమోదైంది. నిరుటితో పోలిస్తే దాదాపు మూడు వేల మెగావాట్ల డిమాండ్ పడిపోవడం గమనార్హం.