హైదరాబాద్, జనవరి 21,
రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతి జ్వాల శాశ్వతంగా ఆరిపోనుంది. ఇండియాగేట్, వార్ మెమోరియల్ వద్ద రెండు జ్వాలల నిర్వహణ కష్టతరమవుతోందని ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల స్మరణార్థం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమర జవాన్ జ్యోతి (Amar Jawan Jyoti) ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.అప్పటినుంచి ఈ అమర జవాన్ జ్యోతి మండుతూనే ఉంది. అయితే.. ఈ జ్యోతి 50 ఏళ్ల తర్వాత శాశ్వతంగా ఆరిపోతుంది. గణతంత్ర దినోత్సవానికి 5 రోజుల ముందు శుక్రవారం జరిగే కార్యక్రమంలో నేషనల్ వార్ మెమోరియల్ టార్చ్‌తో దీనిని విలీనం చేయనున్నారు. అయితే.. ఈ చర్యపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది సరైనది కాదంటూ రాహుల్ గాంధీతో సహా పలు పార్టీలకు చెందిన నేతలు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.అయితే.. దీనిపై తప్పుడు సమాచారం అందిస్తున్నారని.. బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘అమర్ జవాన్ జ్యోతి జ్వాల ఆరిపోవడం లేదు.. దాన్ని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో (నేషనల్ వార్ మెమోరియల్) కలిపేస్తున్నారంటూ పేర్కొన్నారు. కాగా.. 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న నేషనల్ వార్ మెమోరియల్‌ను రూ. 176 కోట్ల వ్యయంతో 2019లో నిర్మించారు. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.