హైదరాబాద్, జనవరి 22,
ఎన్నికలు వచ్చినా సర్వేలు కామన్.. కొన్ని పార్టీలు, నేతలు సర్వే ఏజెన్సీలను సంప్రదించి మరీ సర్వేలు చేయించుకోవడం చూస్తుంటాం.. తమ పరిస్థితి ఏంటి? ఎన్నికలకు వెళ్తే ఏం జరగబోతోంది? అనేదానిపై ఓ అంచనాకు వస్తుంటారు.. అయితే, ఎన్నికలు లేని సమయంలోనూ సర్వేలు జరుగుతూనే ఉంటాయి.. పార్టీలు, నేతలు, పాలన, ప్రభావితం చేసిన అంశాలు.. ఇలా కొన్నింటిని ఎంచుకుని సర్వే చేస్తుంటారు… అయితే, తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే.. ఏ పార్టీ పరిస్థితి ఏంటి? అనేదానిపై ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన తాజా సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఆ ఫలితాల ప్రకారం తెలంగాణలో బీజేపీ పుంజుకోగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురుదెబ్బ తప్పదని తేల్చింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. భారతీయ జనతా పార్టీ 6 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.. అంటే.. బీజేపీ అదనంగా రెండు స్థానాలను గెలుచుకోనుంది.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే.. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురు దెబ్బతప్పదని తేల్చింది ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. టీఆర్ఎస్ గత ఎన్నికల్లో 9 సీట్లలో సత్తా చాటగా.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఒక స్థానం కోల్పోయి 8 స్థానాలకే పరిమితం కానుంది.. ఇక, కాంగ్రెస్ పార్టీ గత సాధారణ ఎన్నికల్లో మూడు పార్లమెంట్ సీట్లు గెలుపొందగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం రెండు స్థానాలకే పరిమితం అవుతుంది స్పష్టం చేస్తున్నాయి సర్వే ఫలితాలు.. కాగా, తెలంగాణలో అప్పుడే పొలిటికల్ హీట్ మొదలైంది.. నేతల ప్రసంగాలు, ఆరోపణలు, విమర్శలు చూస్తుంటే.. ఇక, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయా? అనే అనుమానాలు కలిగిస్తున్నాయి.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగితే ఇంకా చాలా సమయమే ఉంది.. మరి.. అప్పటి వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.. ? ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుపొందే అవకాశం ఉందో..? విన్నర్ ఎవరు? ఎవరికి ఓటమి తప్పదు అనేది వేచి చూడాల్సిన అంశమే