విజయవాడ, జనవరి 22,
పట్టుదలకు పోతే ఇంతే సంగతులు. ఏదైనా పట్టువిడుపులు ఉండాలి. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఉందా? సానుకూలత ఉందా? అన్నది తర్వాత చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మాత్రం ప్రజల్లో అంత సానుకూలత లేదు. ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్ల సాధనకు పట్టుబట్టడానికి ఇది సరైన సమయం కాదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. వారు నిజంగానే సమ్మెకు దిగితే వారు నష్టపోయే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఉపాధి కూలీలు లక్షలాది మంది వందల కిలోమీటర్లు నడిచి వెళ్లారు. తినడానికి తిండి లేక, తాగటానికి నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కరోనా సమయంలో అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఏ రంగమూ లాభదాయకంగా లేదనే చెప్పాలి. ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ప్రతి నెల ఠంచను గా జీతాలు అందుకుంటున్నారు. మిగిలిన ప్రయివేటు కార్మికులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు. ప్రభుత్వోద్యోగుల్లో అత్యధిక శాతం మంది కాంట్రాక్టు సిబ్బంది పైనే ఆధారపడి ఉన్నారు. దాదాపు యాభై శాతం మందికి పైగానే నేడు కూడా కంప్యూటర్ ను ఆపరేట్ చేసే సామర్థ్యం లేదు. వారంతా కాంట్రాక్టు సిబ్బందితోనే ఎక్కువ పనులు చేయిస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగుల పట్ల కపట ప్రేమను చూపిస్తున్న ఒక వర్గం మీడియా కరోనా సాకు చూపి వారి సొంత మీడియా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతాల్లో కోత ఎందుకు పెట్టింది? లాభాలు రావడం లేదు అనే కదా? ఆర్థిక భారం మోయలేమనే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో దాదాపు ఏడాది పాటు జీతాల్లో కోత విధించారు. ఖర్చులు తగ్గించుకోవడానికి అనేక విన్యాసాలు వాటి యాజమాన్యం చేసింది. వాటిని మర్చిపోయి ఇప్పుడు ఫిట్ మెంట్ ను పెంచకపోతే ఉద్యోగులు వీధినపడుతున్నారంటూ యాగీ యాగీ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప ఈ రెండు పత్రికల యాజమాన్యాలకు ఉద్యోగులపై అంత ప్రేమ లేదు. వీరికి అవసరమా? ఇక ఉద్యోగ సంఘాల్లో ఉపాధ్యాయులు మొన్న చేసిన ఆందోళనపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ఉపాధ్యాయుడు నెలకు లక్షకు పైగానే జీతం తీసుకునే వారు కూడా ఉన్నారు. కనీసం నెలకు అరవై వేలకు తగ్గదు. ఇక సెలవులంటే వారికి ఉన్న సెలవులు ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఉండవు. కానీ వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదట. అందుకనే జీతాలు పెంచాలని టీచర్లు కలెక్టరేట్ ను ముట్టడించిన తీరు విమర్శలకు తావిచ్చింది. పునరాలోచించుకుంటే.. ఉద్యోగ సంఘాలు కూడా పునరాలోచించుకుంటే మంచిది. ఒక్క హెచ్ఆర్ఏ విషయంలో మాత్రమే ఉద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పాలి. మిగిలిన అంశాల్లో వారికి జరిగిన నష్టమేమీ లేదు. ప్రజల్లో భాగమంటూనే వారు కట్టే పన్నుల నుంచి అత్యధిక భాగం తాము పొందాలనుకోవడం దురాశే అవుతుంది. అయినా సమ్మె చేయడానికి ఇది సమయం కూడా కాదు. ముందు కోవిడ్ నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాల్సిన బాధ్యత ఉద్యోగులపైన కూడా ఉంది. ప్రభుత్వంపై మొండిగా వ్యవహరిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తే అప్పుడు కాలు వెనక్కు తీసుకోవాలన్నా కుదరదు మిత్రమా? ఆలోచించుకోండి. ప్రజల నుంచి మీకు మద్దతు ఉంటుందనుకోవడం అత్యాశే. విపక్షాలు తప్ప ఎవరూ మీకు అండగా ఉండన్నది వాస్తవం.