YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లీడర్లు ఎక్కడ..

లీడర్లు ఎక్కడ..

ఒంగోలు, జనవరి 22,
వర్గ రాజకీయాలకు పెట్టింది పేరైన ప్రకాశం జిల్లా చీరాలలో ఓటర్లు విభిన్నంగా తీర్పులు ఇస్తుంటారు. చీరాల నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన 16 శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే.. ఎనిమిదిసార్లు ఇతర పార్టీల క్యాండిడేట్స్‌ గెలిచారు. ప్రగఢ కోటయ్య, కొణిజేటి రోశయ్య వంటి ఉద్ధండులు చీరాలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా టీడీపీకి కూడా ఇక్కడ బలమైన కేడర్ ఉంది. చేనేత సామాజికవర్గం అధికంగా ఉండే చీరాల నియోజకవర్గంలో ఎస్సీ ఓటు బ్యాంకు కూడా బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై గెలిచారు. ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. కరణం బలరాం కుమారుడు వెంకటేష్ వైసీపీలో చేరటంతో అధికారపార్టీకి బలరాం మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే కరణం బలరాం వెళ్లిపోయాక.. యడం బాలాజీని చీరాల టీడీపీ ఇంఛార్జ్‌గా నియమించింది పార్టీ అధిష్ఠానం. ఇంఛార్జ్‌ హోదాలో కొద్దిరోజులు టీడీపీ కార్యక్రమాలకు హాజరైన బాలాజీ ఆ తర్వాత కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారట. కరణం బలరాంతోపాటు ప్రధాన నాయకులు కూడా టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లటంతో చీరాలలో తెలుగుదేశానికి ముఖ్య నేతలనేవారే లేరు. అయినప్పటికీ కేడరే పార్టీ పిలుపిచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్యే కరణం బలరాంతోపాటు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. టీడీపీ మాత్రం ఇంఛార్జ్‌ను తేల్చడం లేదు. సారథి లేక కేడర్‌ డీలా పడుతున్నారని గమనించిన అధిష్ఠానం చీరాలపై దృష్టి పెట్టింది. కార్యకర్తలకు అండగా నిలబడే నేతలు లేక… ఉన్నవాళ్లూ చేజారితే నియోజకవర్గంలో టీడీపీ మరింత దిగజారిపోతోందని ఆందోళన చెందుతున్నారట. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు సజ్జల రామకృష్ణారెడ్డితో యడం బాలాజీ టచ్ ఉంటున్నారని కొందరు స్థానిక నేతల నుంచి టీడీపీ పెద్దలకు ఫిర్యాదు అందాయట.టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బృందంలోని కీలక వ్యక్తులు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు అనుకూలంగా.. యడం బాలాజీకి వ్యతిరేకంగా సమాచారాన్ని ఇస్తున్నారట. దీంతో నిజనిర్దారణ కోసం టీడీపీ అధిష్ఠానం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తోందట. గ్రామాల కమిటీలతోపాటు మరికొన్ని గ్రామాలను కలిపి ఓ క్లస్టర్‌గా ఏర్పాటు చేసి.. కొందరు నేతలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించబోతున్నట్టు సమాచారం. బీసీలకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న చీరాలలో యాదవ సామాజికవర్గానికి చెందిన పాలేటి రామారావు రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే యాదవ సామాజికవర్గానికి చెందిన నేతను ఇంఛార్జ్‌గా ప్రకటిస్తే ఎలా ఉంటుందని అంచనా వేస్తున్నారట.ఒకవేళ యాదవ సామాజికవర్గానికే అవకాశం ఇవ్వాలని భావిస్తే.. ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీకే చీరాల బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయట. ఇంఛార్జ్‌పై ఏ విషయం తేల్చక.. నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో కొన్ని అనుమానాలు ఉన్నాయట. గతంలో టీడీపీలో ఉండి ఇతర పార్టీలకు వెళ్లిన పాతకాపులు తిరిగి తీసుకురావచ్చన్న ప్రచారంతో అధిష్ఠానం వారికోసం ఎదురు చూస్తుందా.. వారి కోసమే ఇంఛార్జ్‌ని పెట్టడం లేదా అనే అనుమానాలు ఉన్నాయట. మరి టీడీపీ అధిష్ఠానం ఏం చేస్తుందో చూడాలి.

Related Posts