విజయవాడ, జనవరి 22,
కరోనా ఏ రాష్ట్రాన్నీ వదలడం లేదు. నెల క్రితం వందల్లో వున్న కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు వేలల్లోకి చేరాయి. తాజాగా ఏపీలో కరోనా భారీగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.గుంటూరు, విశాఖ, చిత్తూరు జిల్లాలలో కరోనా కట్టడిపై అధికారులు చేతులెత్తేశారేమో అనిపిస్తోంది. జిల్లాలో రాజకీయ పార్టీల కార్యక్రమాలు, తెరుచుకున్న సినిమా థియేటర్లతో పాటు సందడి ఎక్కువైంది. మూడు నెలలుగా కరోనా కొత్త వేవ్ వస్తుందని ప్రపంచం మొత్తం మొత్తుకుంటున్నా అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదేమో అనిపిస్తోంది.ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నా వ్యాక్సిన్ వేయించుకున్న ధీమానో ఏమో తెలీదు గానీ కరోనాను లైట్ తీసుకుంటున్నారు. కరోనా వ్యాధిని అరికట్టడంలో అధికారులు సైతం చిత్తశుద్ధి చూపించడం లేదు. తెరుచుకున్న సినిమా థియేటర్లు, స్కూల్స్, షాపింగ్ మాల్స్ ఒకటేంటి ..ఇప్పుడు ఏకంగా ఎగ్జిబిషన్ లు కూడా పెట్టి కరోనాను వైఫై మాదిరిగా ఇంటింటికి పంపిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులవారు కనీస బాధ్యత, స్పృహ లేకుండా కరోనాని కాసుల కలెక్టింగ్ కి వాడేస్తున్నారు. వాస్తవానికి ఏదైనా బహిరంగంగా అ సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే, 200మంది లోపు ప్రజలు వచ్చేలాగా కరోనా నిబంధనలు పాటించే లాగా ఆంక్షలు ఉన్నాయి… ప్రభుత్వ కార్యక్రమాలు అయితే కొంతమేర పర్లేదు, అక్కడ కచ్చితంగా కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు . కానీ కొందరు అసలు నిబంధనలు పాటించడం లేదు.గడచిన 24 గంటల్లో 44,516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. విశాఖ జిల్లాలో 2,244 పాజిటివ్ కేసులు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు, అనంతపురం జిల్లాలో 1,235 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులు, గుంటూరు జిల్లాలో 1,054 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,051 కేసులు నమోదయ్యాయి.కరోనా మృతుల సంఖ్య 14,532కి పెరిగింది.