కడప జనవరి 22
ఉద్యోగ ,ఉపాధ్యాయ పిఆర్సి విషయంలో వారికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావలసిన వాటిని సాధించుకోవడంలో వారికి కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి సహాయ సహకారాలు అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు తెలిపారు. పదవ పిఆర్సి వరకు పెరుగుతూ వచ్చిన జీతాలు, జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని పదకొండవ పిఆర్సి లో జీతాలు తగ్గడం చాలా విడ్డూరంగా ఉందని నీలి శ్రీనివాసరావు అన్నారు. ఇంటి అద్దె అలవెన్సు గతంలో ఉన్న దానికంటే సగానికి సగం తగ్గించడం చాలా దారుణమైన విషయమన్నారు. సి పి ఎస్ రద్దు చేయమని ఉద్యోగులు అడుగుతే, సి సి ఎ రద్దు చేసిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తూనే, సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు చేయకపోవడం అన్యాయమన్నారు. పెన్షనర్లకు ఎక్స్ట్రా బెనిఫిట్ 70 ఏళ్ళ కే గతంలో ఇస్తూ ఉంటే, దానిని 80 సంవత్సరాలకు చేయడం విడ్డూరమన్నారు. ఉద్యోగ , ఉపాధ్యాయ, పెన్షనర్ల కు కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలుస్తుంది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన తప్పు తాను తెలుసుకొని పదకొండవ పిఆర్సి విషయంలో ఉద్యోగులకు మేలు జరిగేలా చూడాలని అన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరాటంలో సైతం దిగుతుందని అన్నారు.