YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

గ్రామాల్లో ఎన్నికల పనులు

 గ్రామాల్లో ఎన్నికల పనులు

ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. మరోపక్క గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం లేకుండా చేసేందుకు ఉమ్మడి జిల్లాలో భారీఎత్తున నిధులు మంజూరు కాగా సీసీ రహదారుల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మార్చి చివరి వారంలో మొదలైన సీసీ రహదారుల పనులు మే నెలాఖరు లోపు పూర్తిచేయించాలన్న పట్టుదలతో నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. ఉపాధి హమీ పథకంలో చేపట్టిన సీసీ రహదారుల నిర్మాణంలో రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు ముందంజలో ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా మిగితా జిల్లాల కంటే ముందుంది. ఈ జిల్లాలో 70 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. వనపర్తి జిల్లాలో 65, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు జిల్లాల్లో 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఉపాధి హమీ పథకం ద్వారా 90 శాతం నిధులు మంజూరు కాగా ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా మంత్రుల కోటా నుంచి 10 శాతం నిధులు కేటాయించారు. ఉమ్మడి జిల్లాకు 6,631 సీసీ రహదారులు, రూ. 278 కోట్లు మంజూరు చేశారు. ఈనెల 8 నాటికి 3,707 సీసీ రహదారులు పూర్తయినట్లు అధికారుల సమాచారం ద్వారా తెలుస్తోంది. మిగితా 2,691 పనులు కూడా ఈ నెలాఖరు లోపు పూర్తి చేయటానికి అధికారులు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచుతూ నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు. జూన్‌లో పంచాయతీ ఎన్నికల కోసం ప్రకటన వెలువడే అవకాశం ఉండటం వల్ల అంతలోపు పనులు పూర్తి చేయించకుంటే సర్పంచులు కూడా పనులు మధ్యలోనే నిలిపివేసే ప్రమాదముంది. గతంలో గ్రామానికి ఒకటి, రెండుకు మించి సీసీ రహదారులు మంజూరు అయ్యేవి కాదు. ప్రస్తుతం ప్రభుత్వం మండల కేంద్రాల్లో దాదాపు రూ. కోటి వరకు ఇందుకు కేటాయించింది. 18 నుంచి 20 సీసీ రహదారులను నిర్మించేందుకు ఒకేసారి అనుమతులు ఇచ్చింది. గ్రామాలకు కూడా  సీసీ రోడ్లను వేసేందుకు రూ. 20 నుంచి 30 లక్షల వరకు మంజూరు చేసింది. ఫలితంగా అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులన్నీ సీసీ రహదారులు మారుతుండటంతో గ్రామాల్లో చాలా వరకు పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడింది. పంచాయతీ ఎన్నికలకు ముందు భారీ ఎత్తున సీసీ రహదారులకు నిధులు మంజూరు కావటంతో ప్రస్తుత పాలక వర్గాలు పనులు పూర్తిచేసి వచ్చే ఎన్నికల్లోనూ గెలవాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నాయి.

Related Posts