YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీలో గుబులు మొదలైందా...

గులాబీలో గుబులు మొదలైందా...

కరీంనగర్, జనవరి 25,
టీఆర్ఎస్ నేతలు నిత్యం ప్రెస్ మీట్లు… అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. గత పక్షం రోజులుగా అడపాదడపా కార్యక్రమాలతోనే పబ్బం గడుపుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేనేతలు ఒక్కసారిగా సైలెంట్ కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కొవిడ్ ఆంక్షల పేరుతో సైలెంట్ అయ్యారా? లేకుంటే నాయకత్వం వద్దన్నదా? లేకుంటే నిధులు లేవని నీరసపడ్డారా? అనేది అంతుచిక్కని ప్రశ్నటీఆర్ఎస్ అంటేనే దూకుడుగా పేరొందింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడుతుండటంతోపాటు ప్రజా సమస్యలపై, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆపార్టీ నేతలు చురుకుగా పాల్గొంటున్నారు. అయితే సంక్రాంతి ముందు నుంచి దూకుడు తగ్గింది. అడపాదడపా ప్రెస్ మీట్లు, అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు, సమీక్షలతోనే ఆపార్టీ నేతలు కాలం వెల్లదీస్తున్నారు. నిత్యం పార్టీ నేతలతో తెలంగాణ భవన్ సైతం నాయకులతో కళకళలాడేది. అయితే భవన్ కు సైతం పార్టీ శ్రేణుల రాక తగ్గింది. ఒక్కసారిగా తగ్గడంతో ఏం జరుగుతుందోనని పార్టీలో చర్చనీయాంశమైంది.ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. సీఎం కేసీఆర్ సైతం ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ఆ నిరసనలు చేపడుతూనే మరోపక్క పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అంతేగాకుండా రైతుబంధులో భాగంగా రైతుల ఖాతాల్లో 50వేలకోట్లు జమఅయిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సంబురాల్లో పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాదు ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను సవరించాలని బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్ష పై కూడా టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి విమర్శలు చేశారు. నిత్యం బీజేపీ తీరును ఎండగట్టారు. కానీ ఒక్కసారిగా పార్టీ నేతల దూకుడు తగ్గింది. దీంతో టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీ నేతలు సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం.రాష్ట్రంలో రోజురోజూకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నెల 30వరకు కొవిడ్ నిబంధనలు పొడిగింది. అయితే గతంలో కొవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ రైతుబంధు సంబురాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలను చేపట్టారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. పార్టీలో జోష్ నింపారు. అయితే సంక్రాంతి పండుగ వారం రోజుల ముందు నుంచి ఇప్పటివరకు పార్టీలో కొంత స్తబ్దత నెలకొంది. కొవిడ్ నిబంధనలు ఉండటంతోనే పార్టీ కార్యక్రమాల్లో స్తబ్దత నెలకొందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ పార్టీ నేతల్లో మాత్రం నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ప్రతిపక్షాలపై గత కొంతకాలంగా టీఆర్ఎస్ నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వ్యాఖ్యల్లో పదును పెంచారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రతిపక్షాలకు అస్త్రాలు అందిస్తున్నారు. అధికార పార్టీలోని కొందరు చేస్తున్న వ్యాఖ్యలే కాంగ్రెస్‌, బీజేపీలకు ఆయుధాలుగా మారుతున్నాయి. సున్నితమైన అంశాల్లో అధికార పార్టీ నేతలు మరింత జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉన్నప్పటికీ వాటిని ఖాతర్ చేయడం లేదు. వారి వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి. వారి వివాదాస్పద కామెంట్స్‌ టీఆర్‌ఎస్ నాయకత్వానికి..ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, కాషాయ పార్టీలపై వ్యతిరేకతను ప్రజల్లో మరింతగా పెంచాల్సింది పోయి తమ పార్టీ కిందకే నీళ్లు తెస్తున్నారని భావించిన పార్టీ అధిష్టానం దూకుడు తగ్గించాలని సూచించిందా? అనేది పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే పార్టీ కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని, తగిన గుర్తింపు ఇవ్వడం లేదని భావించి నీరసపడ్డారా? అనేది నేతలకే తెలియాలి.

Related Posts