రాజమండ్రి, జనవరి 25,
అరటి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గిట్టుబాటు ధర లభించకపోవడంతో కనీసం పెట్టుబడులు కూడా రాక నష్టపోతున్నాడు. కూలి, రవాణా ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో అరటి గెలలను కోయకుండా చెట్లకే వదిలేస్తున్నారు. కాయలు పండిపోయి రాలిపోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పది వేల ఎకరాలకుపైగా అరటి సాగవుతోంది. పెరవలి, పెనుగొండ, కొవ్వూరుతోపాటు గోదావరిని అనుకుని ఉన్న లంక గ్రామాల్లోనూ, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట వంటి మెట్ట మండలాల్లోనూ అరటిని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అరటి గెలల కోత సీజన్ ప్రారంభమైంది. వ్యాపారులు, దళారులు రైతుల నుంచి అరటి గెలను రూ.వంద, రూ.110కు కొనుగోలు చేస్తున్నారు. గెలకు రూ.150పైగా ధర వస్తే తప్ప కనీసం ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు చెప్తున్నారు. ఒక ఎకరాలో 750 అరటి మొక్కల వరకూ నాటుతారు. తొలి ఏడాది వెదురు గెడల కొనుగోలు, ఎరువులు వంటి ఖర్చులన్నీ కలిపి ఎకరాకు రైతులకు రూ.లక్షకుపైగా, కౌలు రైతులకు కౌలుతో కలుపుకొని రూ.1.40 లక్షల వరకూ ఖర్చవుతోంది. రెండో ఏడాది గెడల ఖర్చు తగ్గుతుంది. తొమ్మిది నెలలకు అరటి పంట కోతకు వస్తుంది. ఎకరంలో వేసిన 750 మొక్కలూ కాపుకాస్తే 750 గెలల దిగుబడి వస్తాయి. ప్రస్తుతం ధర ప్రకారం రూ.75 వేల నుంచి రూ.80 వేలులోపే ఆదాయం వస్తోంది. ఎకరా ఒక్కంటికీ రైతులకు రూ.20 వేలకుపైగా, కౌలు రైతులకు రూ.60 వేలకుపైగా నష్టం వస్తుండడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అరటిని నిల్వ చేసుకోవడానికి వీలు ఉండదు. చెట్టున ఉండగానే కోతకోసి తరలించాల్సి ఉంటుంది. ఇదివరకూ తోట మొత్తం గుత్తగా వ్యాపారులు కొనుగోలు చేసేవారు. అనువైన సమయంలో అరటి గెలలను కోయించి తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. వ్యాపారులు తోట మొత్తాన్ని కొనేందుకు ముందుకు రావడం లేదని, గెలల ప్రాతిపదికన తామే మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలలను కోసి తోట నుంచి వాహనాల్లో మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అయిన ఖర్చు కూడా రావడం లేదని చెప్తున్నారు. అరటికి గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.మూడెకరాల్లో అరటి సాగు చేస్తున్నాను. ప్రస్తుతం గెలలు కోతకు రావడంతో కోసి విక్రయిస్తున్నాం. గెల ఖరీదు రూ.వంద, రూ.110 మించి పలకడం లేదు. ఎకరాకు రూ.20 వేలకుపైగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. అరటి రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి