విజయనగరంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రచంఢ రూపం దాల్చడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. మొన్నటి వరకు వర్షాలు పడటంతో చల్లగా ఉన్న జిల్లా మూడు రోజులుగా ఉష్ణోగ్రతల తీవ్రతకు ఉడికి పోతోంది. ఉదయం 7గంటల నుంచే ఎండ మండిపోతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోజుకు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. టెంపరేచర్ల ఎఫెక్ట్‌కు రహదారులన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా 42 డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటల లోపే 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయానికి అదికాస్తా అత్యధికంగా 42 డిగ్రీలకు చేరుతోంది. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. కొద్దిరోజులుగా అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్న దుస్థితి. ఏసీలు, కూలర్లు ఉన్నవారి పరిస్థితి బాగానే ఉన్నా.. ఇలాంటి సౌకర్యాలు లేని వారు సతమతమైపోతున్నారు. ఉష్ణతాపానికి ఇప్పటికే వడదెబ్బతో జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. దీంతో బయటకు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు.
ప్రధాన పట్టణాలైన విజయనగరం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, గజపతినగరం, ఎస్.కోట, కొత్తవలస, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో ఎండల ధాటికి ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావడం లేదు. ఇక కూలి పనులకు వెళ్లేవారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. వారు ఎండ దెబ్బకు చెట్ల నీడన చేరుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే బస్టాండ్లలో జనాల రద్దీ కొద్దిగా తగ్గింది. పలు రోడ్లు బోసిపోతున్నాయి. కొన్ని రోజులు పాటు ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అత్యవసర పనులుంటే తప్ప బయటకు వెళ్లకూడదని వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రజలు భయపడుతున్నారు. అంతేకాక జిల్లాకు వర్ష సూచన కూడా ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఈదురు గాలులు, వర్షాలుపడే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో పలు మండలాల్లో పిడుగులు భారీగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాలుష్యం, ఓజోన్ పొర దెబ్బతినడంతో కొంతకాలంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు అధికంగా పెంచితే ఈ సమస్యను కొంత అధిగమించే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.