YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికలు జరిగేనా?

  ఎన్నికలు జరిగేనా?

పశ్చిమగోదావరి జిల్లాలోని పలువురు సర్పంచుల పదవీ కాలం ఈ ఏడాది జులై నెలాఖరుకు ముగుస్తోంది. దీంతో ఆ సమయానికల్లా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శిని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా కలెక్టర్లకు సైతం ఆదేశాలు చేరినట్లు సమాచారం. కానీ ఎన్నికల నిర్వహణపై మాత్రం కొంత సందిగ్ధత కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే పంచాయతీ ఎన్నికలకు ప్రస్తుతం ప్రభుత్వం సిద్ధంగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే అధికారుల పాలన తప్పదన్న వాదన వినిపిస్తోంది. 2013 జూలై 20, 27, 31 తేదీల్లో మూడువిడతలుగా జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వచ్చే జూలై నెలాఖరుకు పంచాయతీల పదవికాలం ముగుస్తోంది. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే జిల్లాలోని 909 పంచాయతీల్లో ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త పాలకవర్గాలు కొలువుతీరుతుంది. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు రావడంతో పంచాయతీ ఎన్నికలపై జిల్లాలో చర్చ కొనసాగుతోంది. ఆశావహులు తెరపైకి వస్తున్నారు. బలబలాలు, ఆర్ధిక పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచన కనిపించడం లేదు. దీంతో ఆశావహుల్లో కొంత నిరాశ నెలకొంది. ఇదిలాఉంటే ఈ ఎన్నికల కోసం బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించలేదని సమాచారం. ఈ నెల 15వ తేదీన గ్రామాల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని, జూన్‌ 15న పోలింగ్‌ బూత్‌ వివరాలు ప్రదర్శన, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళా రిజర్వేషన్లను నిర్ధేశించాలి వంటి అంశాలను ఎన్నికల కమిషన్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయినప్పటికీ ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోలేదు.

 

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆ ఎన్నికల వేడి సైతం మొదలైంది. ప్రధాన పార్టీలు విజయం కైవసం చేసుకునేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గెలుపోటముల ప్రభావం సాధారణ ఎన్నికలపై పడనుందన్న భావనలో సర్కార్ ఉండి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంతోనే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయాలన్న ఆలోచనలో ఉండొచ్చని చర్చించుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు సాగకుండా వాయిదా పడితే మాత్రం మరో ఏడాదికిపైగా అధికారుల పాలనలోనే గ్రామాలు నడవనున్నాయి. అదే జరిగితే గ్రామాల్లో పాలన పూర్తిగా కుంటిపడిపోయే ప్రమాదముందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 500 మంది మాత్రమే పంచాయతీ కార్యదర్శులున్నారు. ఒక్కొక్కరు మూడునాలుగు పంచాయతీలకు అధికారులుగా పనిచేస్తున్నారు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్పంచులు అందుబాటులో ఉండడంతో సమస్యలను చెప్పుకుంటున్నారు. అదే అధికారుల పాలన వస్తే ఇక జనం సమస్యలతో మగ్గిపోవాల్సి వస్తుందని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలు దృష్టించి సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలకు మరింత మంచి పాలన అందించే అవకాశం ఉంటుందని అంతా అభిప్రాయపడుతున్నారు. దీంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

Related Posts