గ్రామాల్లో ఉత్సాహభరితంగా సాగే తిరునాళ్లు, జాతరలు, పండగులు, ప్రత్యేక వేడుకలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. తిరుపతి నగరంలో వెలిసిన తాతయ్యగుంట గంగమ్మ జాతర కూడా ఇలాంటిదే. రాయలసీమ జిల్లాలోనే ఈ జాతర చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి నెల చైత్రమాసం చివరిలో వైభవంగా ఈ జాతర జరుగుతుంది. వారం రోజుల పాటూ సాగే ఈ సంబరం అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఉత్సవాలు సాగే వారమంతా స్థానికులే కాక చుట్టుపక్కల ప్రాంతాల్లోని భక్తులు వేలాదిగా ఈ ప్రాంతానికి తరలివస్తారు. దీంతో తిరుపతి మరింత సందడిగా మారిపోతుంది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జన్మస్థలం తిరుపతి రూరల్ అవిలాల గ్రామం. పూర్వకాలంలో తిరుపతిని పాలేెగాళ్లు పాలించేవారు. పాలేగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలేగాడు, యవ్వనవతి అయిన స్త్రీలను కామించి, చెరిచేవాడని, ఆ పాలేగాడిని హతమార్చి స్త్రీజాతిని కాపాడేందుకు ఆదిపరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించిందని పురాణ గాథ చెప్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పాలేగాడు ప్రాణబీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కొని జీవిస్తుండేవాడు. పాలేగాన్ని బయటకు రప్పించేందుకు గంగమ్మ రోజుకు ఒక అవతారం వేసుకుని బూతులు తిడుతూ సంచరిస్తుండేది. చివరకి దొరవేషంలో సంచరించే సమయంలో పాలేగాడిని కనిపెట్టి అతని తల నరికి హతమారుస్తుంది.
పాలేగాడిని హతమార్చిన దినమే గంగమ్మ దేవత జన్మించిన చైత్రమాసం. చైత్రమాసం చివరి వారంలో గంగమ్మజాతర ఉత్సవాలను వారం రోజుల పాటు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. గంగమ్మ జన్మస్థలమైన తిరుపతి రూరల్ ప్రాంతంలోని అవిలాల గ్రామంలో చైత్రమాసం మూడో వారం జాతర నిర్వహించి అక్కడ నుంచి పసుపు కుంకుమను తిరుపతి గంగమ్మ గుడికి సారెగా తీసుకొచ్చి జాతర చాటింపు వేస్తారు. ఇప్పటికీ అదే ఆనవాయితీ కొనసాగుతోంది. తాతయ్యగుంట గంగమ్మతోపాటు అంకాలమ్మ, తాళ్లపాక గంగమ్మ, వేశాలమ్మ, ముత్యాలమ్మ, పేరంటాలమ్మ, పోలేరమ్మలకు సైతం అదే వారంలో జాతర్లు నిర్వహిస్తారు. ఇక జాతర సాగే రోజుల్లో చాటింపు అనంతరం మరుసటి రోజు నుంచి ప్రజలు రోజుకొక్క వేషం వేసి గంగమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మొక్కుల చెల్లింపు కన్నులపండుగగా సాగుతుంది. జాతర ముగింపు రోజున బంకమట్టి గడ్డితో అమ్మవారి విశ్వరూపాన్ని తయారు చేస్తారు. అమ్మవారి విశ్వారూపాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తారు. అత్యంత వైభవోపేతంగా సాగే ఈ జాతరలో స్థానికులే కాక ఇతర ప్రాంతాల్లోని భక్తజనం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.