YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కేంద్ర, రాష్ట్రాల మధ్య ఐఏఎస్ ల చిచ్చు

కేంద్ర, రాష్ట్రాల మధ్య ఐఏఎస్ ల చిచ్చు

హైదరాబాద్, జనవరి 27,
అఖిల భార‌త స‌ర్వీసుల (ఏఐఎస్‌) రూల్స్‌- 1954 కి కేంద్రం చేసిన సవ‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌లు కేంద్ర -రాష్ట్ర సంబంధాల మ‌ధ్య చిచ్చురేపాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడికి లేఖ‌లు రాశారు. అంతేకాదు, మధ్యప్రదేశ్, మేఘాలయ, బీహార్ వంటి ఎన్డీయే పాలిత రాష్ట్రాలు కూడా స‌వ‌ర‌ణ‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నాయి. మరిన్ని రాష్ట్రాలు వీటితో జ‌త‌క‌ట్టే అవ‌కాశం ఉంది.కేంద్ర ప్ర‌భుత్వ‌ ప్రతిపాదన దుర్మార్గ‌మైన‌ద‌ని, సహకార సమాఖ్య భావనకు విరుద్ధమ‌ని ప్ర‌తిప‌క్ష పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అంటున్నారు. కేంద్రం చ‌ర్య అధిక-కేంద్రీకరణకు దారితీస్తుందని, అలాగే అధికారులలో భయాందోళనలను సృష్టిస్తుందని అంటున్నారు. అంతేకాదు అధికారుల నైతికతను ప్రభావితం చేస్తుందని కూడా వారు అందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే వారు ఈ ప్ర‌తిపాద‌నను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించటం రాజ్యాంగ విరుద్దం అంటున్నారు.కేంద్రం చేసిన కొత్త ప్ర‌తిపాద‌న ప్రకారం ఓ అఖిల భారత స‌ర్వీస్ అధికారి సేవ‌లు కావాల‌నుకున్న‌ప్పుడు రాష్ట్రం అనుమ‌తితో సంబంధం లేకుండా కేంద్రం ఆ అధికారిని పిలిపించుకోవ‌చ్చు. వాస్త‌వానికి వారు ఇటు కేంద్రం, అటు కేటాయించిన‌ రాష్ట్రం మధ్య తిరుగుతూ ఉంటారు. ఒక ఏఐఎస్ అధికారి త‌న మొదటి 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వంలో సేవ‌లు అందించాలి. త‌రువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌ మధ్య రొటేట్ అవుతారు. రాష్ట్రంలో మూడేళ్లు ప‌నిచేస్తే కేంద్రంలో ఐదేళ్లు చేయాల్సి వుంటుంది.ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్,, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ తో పాటు మ‌రో 30 ఇత‌ర స‌ర్వీసులు ఏఐఎస్ పరిధిలోకి వస్తాయి. ఈ అధికారుల‌ను కేంద్రం రిక్రూట్ చేసి రాష్ట్ర కేడర్ కింద ఉంచుతుంది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్ అధికారులు కేంద్ర , రాష్ట్ర స్థాయిలలో సేవలందిస్తారు.రాష్ట్ర కేడర్ నుండి కేంద్రం గరిష్టంగా న‌ల‌బై శాతం మంది అధికారులను త‌న అవ‌స‌రాల‌కు వాడుకోవ‌చ్చు. ఇందుకోసం, ఢిల్లీకి డిప్యూటేషన్‌పై వెళ్లడానికి సిద్ధంగా ఉన్న అధికారుల జాబితా ఇవ్వాల‌ని రాష్ట్రాలను అడుగుతుంది. సంబంధిత రాష్ట్రం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్వోసీ) పొందిన తర్వాత దాని నుండి అధికారులను ఎంపిక చేస్తుంది. ఈ ప్ర‌క్రియ‌లో బేధాభిప్రాయాలు ఉంటే దానిపై కేంద్రం నిర్ణ‌యం తీసుకుంటుంది. ఆ నిర్ణ‌యాన్ని రాష్ట్రం అమలు చేయాలి.ప్ర‌స్తుతం ఏఐఎస్ అధికారుల డిప్యుటేషన్‌ నిర్ణయంపై కేంద్రం మరిన్ని అధికారాలను కావాల‌ని బావిస్తోంది. తాజా ప్ర‌తిపాద‌న ప్ర‌కారం అధికారిని కేంద్ర డిప్యూటేషన్‌పై పంపే విష‌యంలో రాష్ట్రం జాప్యం చేసినా , నిర్ధిష్ట సమయంలోగా కేంద్రం నిర్ణయాన్ని అమలు చేయని ప‌క్షంలో కేంద్రం ముందు చెప్పిన డేట్ అండ్ టైమ్ ప్రకారం స‌ద‌రు అధికారి క్యాడర్ నుండి ఆటోమేటిక్‌గా రిలీవ్ అవుతారు.ఓ నిర్దిష్ట రాష్ట్రం నుంచి ఎంత మంది అధికారులను డిప్యూటేషన్‌ చేయాలనేది ఆ రాష్ట్రంతో సంప్రదించి నిర్ణయించే అధికారం కూడా కేంద్రం కోరుతుంది. ఆ జాబితాను రాష్ట్రం ఇవ్వాల్సి వుంటుంది. ఈ క్ర‌మంలో వివాదాలు తలెత్తితే కేంద్రం నిర్ణయమే అంతిమం. దానిని రాష్ట్రం నిర్ణీత గడువులోగా అమలు చేయ‌క‌త‌ప్ప‌దు. అలాగే, ప్రజాప్రయోజనాల దృష్ట్యా కేంద్రం ఏ అధికారినైనా డిప్యూటేషన్‌పై పిలిపించుకోవ‌చ్చు. రాష్ట్రం మ‌రో మాట మాట్లాడ‌కుండా అడిన స‌మ‌యానికి ఆ అధికారిని కేంద్రానికి పంపాల్సి వుంటుంది.ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం అధికారుల కొర‌త‌తో ఇబ్బంది ప‌డుతోంది. రాష్ట్రాలు తగినంత మంది అధికారులను రిలీవ్ చేయనందున తమకు తగిన సంఖ్యలో అధికారులు రావడం లేదని కేంద్రం అంటోంది. జాయింట్ సెక్రటరీ స్థాయిలో సెంట్రల్ డిప్యూటేషన్‌లో ఉన్న ఐఏఎస్ అధికారుల సంఖ్య 2011లో 309 నుండి 223కి తగ్గిందని అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. ప్రస్తుత డిప్యూటీ సెక్రటరీల సంఖ్య 114 కాగా , 2011లో 117 మంది ఉన్నారు. అందుకే రాష్ట్రాలు, అధికారులతో బేరసారాలు లేకుండా త‌మ‌కు అవ‌స‌ర‌మైన సంఖ్య‌లో అధికారుల‌ను పొందేలి ఏఐఎస్ నిబంధనలను సవరించాలని కేంద్రం బావిస్తోంది.మ‌రోవైపు, అధికారుల కొర‌త కేంద్రాన్నే కాదు త‌మ‌నూ వేధిస్తోంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంటున్నాయి. చాలా మంది అధికారులు రాష్ట్ర స్థాయిలో కేంద్ర పథకాల అమలు బాధ్యతలు చూస్తున్న విష‌యాన్ని కేంద్రానికి గుర్తుచేస్తున్నాయి. 2014 నుండి చాలా మంది అధికారులు కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడానికి దూరంగా ఉన్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి.తాజా ప్రతిపాదనపై జనవరి 25లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కేంద్ర ప్ర‌భుత్వ సిబ్బంది- శిక్షణ శాఖ రాష్ట్రాలను కోరింది. రాష్ట్రాలు స్పందించ‌క‌పోతే రిమైండర్‌ను పంపే అవ‌కాశం ఉంది. అప్పటికీ క‌ద‌లిక లేక‌పోతే కేంద్రం ఏక‌ప‌క్షంగా ముందుకు వెళ్లి సవరణలను నోటిఫై చేయ‌వ‌చ్చు.ఇది ఇలావుంటే, అఖిల భారత సర్వీసుల నిబంధ‌న‌ల‌ను సవరించి, రాష్ట్రాల సమ్మతి లేకుండానే అధికారులను తీసుకోవాలనుకోవడం ప్రమాదకరమని సీఎం కేసీఆర్ ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో పేర్కొన్న విష‌యం తెలిసిందే. రాష్ట్రాల్లో పనిచేసే అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి, వారిని పరోక్షంగా నియంత్రించడానికి, చెప్పుచేతుల్లో ఉంచు కోవడానికి కేంద్రం ఈ ఎత్తుగడ వేసిందని ఆరోపించారు. మ‌రి ఈ స‌వ‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌పై కేంద్రం పునరాలోచిస్తుందో లేదో వేచి చూడాలి!!

Related Posts