YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మన్యంలో దాహం కేకలు

మన్యంలో దాహం కేకలు

 వేసవి వచ్చిందంటే చాలు విశాఖ మన్యంలో తాగు నీటి సమస్య ప్రబలిపోతోంది. ఏటా గిరిపుత్రులు మంచినీటి కోసం అల్లాడిపోవాల్సిన దుస్థితి. నిధులు మంజూరైనా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం .. నీటి పథకాలు సకాలంలో పూర్తికాకపోవడం.. వెరసి ఆదివాసులు తాగునీటికి కష్టాలనే ఎదుర్కొంటున్నారు. వేసవి ప్రారంభమైనప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతోనే సమస్య తీవ్రమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలోని గ్రామాల్లో కూడా నీటికి పాట్లు తప్పడం లేదు. నిత్యం నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి గిరిజనులు తీసుకువెళ్లడంతో గత ఏడాది నాబార్డు నిధులు మంజూరు చేసింది. రూ. కోట్ల నిధులతో పలు గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన పనులను ఆన్‌లైన్‌ ద్వారా టెండర్‌ పాడిన కాంట్రాక్టర్లు అప్పగించారు. అయితే పనులు ప్రారంభించి కొత్త ట్యాంకు నిర్మాణాలు చేసి వదిలివేశారు. మరికొన్ని పథకాలు నత్తనడకన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత ఏడాది మంజూరైన ఈ పథకాలకు ఇప్పటి వరకు వినియోగంలోకి తీసుకురాకపోవడంపై గిరిజనులు మండిపడుతున్నారు. కొన్ని పూర్తయినప్పటికీ బోరువేసిన చోట్ల పంపింగ్‌కు విద్యుత్‌ సదుపాయం కల్పించలేదన్న కారణంతో అధికారులు నీటి సదుపాయం కల్పించడంపై ఉదాసీనంగా ఉన్నారు. దీంతో ఈ ఏడాది కూడా వేసవిలో గిరిజనులకు మంచినీరు దొరికే పరిస్థితి కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

 

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలోను నీటి సమస్యతో గిరిజనులు అల్లాడుతున్నారు. పెదలబుడు పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో రూ.లక్షలు ఖర్చుపెట్టి బోర్లు వేశారు. ట్యాంకులు నిర్మించి, ఇంటింటా కుళాయి కనెక్షన్‌ ఇచ్చినా ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో నీరు అందిన పరిస్థితి కనిపించడం లేదు. అరకులోయలోనే సుమారు రూ.2 కోట్లతో మంచినీటి పథకాలు చేపట్టారు. టౌన్‌షిప్‌ అంతా సరఫరా చేయడానికి రెండు పెద్ద ట్యాంకులు నిర్మించారు. అయినా ఫలితం లేకుండా ఉంది. ఇప్పటి వరకు నీటి సదుపాయం వినియోగంలోకి తెచ్చిన దాఖలాలు కన్పించలేదు. టౌన్‌షిప్‌లో నీరందించేందుకు వేసిన పైప్‌లైన్లు ఒక పద్ధతిగా కాకుండా ఇష్టానుసారంగా అమర్చారు. పైప్‌లైన్‌ రోడ్డులో అస్తవ్యస్తంగా అమర్చడంతో స్థానికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుళాయి కనెక్షన్‌ కూడా ఫ్లంబర్‌లకు నచ్చిన విధంగా వేసి వదిలేశారు. ఇప్పటికీ నీటి సౌకర్యం కల్పించకపోవడం, అస్తవ్యస్తంగా నీటి గొట్టాలు బిగించి వదిలివేయడంతో అసౌకర్యంగా మారిందని గిరిజనులు వాపోతున్నారు. ఇదిలాఉంటే ఈ పనుల్లో సంబంధిత ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన నీటి పథకాలు పూర్తి చేసి గిరిజనులకు నీటి సౌకర్యం అందించాలని అంతా కోరుతున్నారు. లేనిపక్షంలో ఈ వేసవిలో గిరిజనులు నీటి ఎద్దడి బారిన పడక తప్పదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

Related Posts