నెల్లూరు
నెల్లూరుజిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు లో శ్రీ దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు జగన్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేసిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు..లీజు పేరుతో ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎస్డీఎస్టిపిఎస్ ను అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధం అవడంతో జెన్కో ఉద్యోగులు,కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది ప్లాంట్ మెయిన్ గేట్ ముందు ఆందోళనకు దిగారు. అప్పుల పేరుతో ప్రాజెక్టు నష్టాలలో ఉందనే సాకుతో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దుర్మార్గపు చర్యగా చెప్పారు. ఈ విద్యుత్ కేంద్రం కోసం వేల ఎకరాల భూమిని ధారపోసిన స్థానికుల బతుకులు అంధకారంలో వెళ్లిపోతాయని భూములు కోల్పోయిన వారి భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రైవేటీకరణ అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానికులకు అన్యాయం జరిగితే ఎవరు సహించరని, దశల వారీగా న్యాయపరమైన పోరాటం చేసేందుకు రాష్ట్ర జేఏసీ నిర్ణయం ప్రకారం ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.