అనంతపురం జిల్లా హిందూపురం సబ్‌రిజిస్టర్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం ఆఫీసుకొస్తే మామూళ్ళు చెల్లిస్తేనేగానీ పనులు కావడంలేదని పలువురు మండిపడుతున్నారు. తరచూ ఏసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నా సబ్‌రిజిస్టర్ ఆఫీసు సిబ్బంది తీరు మారడంలేదని అంటున్నారు. ఏసీబీ నుంచి తప్పించుకునేందుకు సరికొత్త మార్గాలు పాటిస్తూ దందా సాగించేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏసీబీ దాడుల నుంచి తప్పించుకోవడానికి సిబ్బందిలో పలువురు పెద్ద ఎత్తుగడే వేశారని స్థానికులు చెప్తున్నారు. వాహనాలను అడ్డంగా పెట్టిస్తే త్వరగా ఎవరు లోపలికి రాలేరు వచ్చే వారిని పసి గట్టవచ్చు అని దాదాపు 500 పైగా ద్విచక్రవాహనాలు కార్యాలయం ఆవరణంలో నిలుపుతున్నారని అంటున్నారు. ఇది చాలదన్నట్టు గేటు ముందు భాగంలో సైతం వాహనాలు నిలబెట్టారు. ఈ విషయమై స్థానికంగా చర్చ కూడా సాగుతోంది. తమ అవినీతి బాగోతాలు బయటపడకూడదనే సిబ్బంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. జిల్లాలోనే హిందూపురం సబ్‌రిజిస్టర్ కార్యాలయానికి పని ఒత్తిడి అధికం. హిందూపురం సబ్‌రిజిస్టర్ కార్యాలయం ఏ సమయంలో చూసినా బిజీబిజీగా ఉంటుంది. ఇక్కడ రోజూ 30 నుంచి 50 వరకు నూతన రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఒకొక్క రిజిస్ట్రేషన్‌కు కనీసం రూ.2 నుంచి 3వేలు ముట్టజెప్పాల్సిందే అని బాధితులు వాపోతున్నారు.
హిందూపురం సబ్‌రిజిస్టర్ ఆఫీసు వద్ద జిల్లాలో ఎక్కడ లేని విధంగా రియల్‌ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారనీ స్థానికులు అంటున్నారు. కార్యాలయంలో వీరు చెప్పిందే వేదంగా మారిందని వాపోతున్నారు. అధికారులతో సమానంగా స్టాంప్‌వెండర్లు, డాక్ట్యుమెంట్ రైటర్లు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. గతంలో కోర్టులో వివాదంలో ఉన్న స్థలాలతో పాటు ఎన్‌ఒసి తీసుకుని అధికారులు సబ్‌రిజిస్టర్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగిపై చర్యలు తీసుకొన్నారు. వీటన్నింటిపైనా ఆరా తీసినా ఎసిబి అధికారులు ఏ సమయంలోనైనా తనిఖీలు నిర్వహిస్తారని. సబ్‌రిజిస్టర్ కార్యలయం సిబ్బంది పట్టణంలో ఉన్నా వాహనాలన్నింటిని కార్యాలయ ఆవరణంలో నిలుపుతున్నప్పటికి అధికారులు ఒక్కమాట కూడా మాట్లాడక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ ఆఫీసులో పెరిగిపోతున్న అవినీతి ప్రజలకు సమస్యాత్మకంగా మారింది. రిజిస్ట్రేషన్‌కు పెద్ద మొత్తంలో సిబ్బంది దండుకుంటున్నారు. దీంతో స్థానికులు సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. సంబంధిత విభాగం ఉన్నతాధికారులు స్పందించి ఈ అవినీతి దందాకు చెక్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.