YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలి మంత్రి నిరంజన్ రెడ్డి

వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలి మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్
వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలి. జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు. అందుకే నాబార్డ్ సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల పునరుద్దరణతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం నాడు బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి నివాసంలో రాబోయే 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి గాను లక్షా 66 వేల 384 కోట్ల రుణ సామర్థ్యంతో నాబార్డు రూపొందించిన రాష్ట్ర దృష్టి పత్రాన్ని అయన  విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,  అర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు,  వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, , టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు,  ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్  నిఖిల,  నాబార్డ్ సీజీఎం వైకే రావు,  ఎస్ ఎల్ బీసీ చైర్మన్ అమిత్ జింగ్రాన్  తదితరులు హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి తాగునీరు పథకాన్ని పూర్తిచేయడం జరిగినది. ఈ పథకాల మూలంగా తెలంగాణ వ్యాప్తంగా భూగర్భజలాలు పెరిగాయి .. పంటల విస్తీర్ణం పెరగడంతో పాటు రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నది. కానీ సుస్థిర వ్యవసాయం ప్రాధాన్యం గుర్తించి పంట వైవిద్యీకరణలో భాగంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా ధీర్ఘకాలిక ఆయిల్ పామ్ వంటి పంట సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని అన్నారు. దీనికిగాను నాబార్డు సూచనల మేరకు క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు ఆయిల్ పామ్ సాగుకు సహకరించాలి. రైతుల ఆదాయాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, ఆహారశుద్ది రంగంలో ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేస్తున్నది. ప్రతి జిల్లాలో 500 ఎకరాలను గుర్తించి అందులో ఆహార శుద్ది పరిశ్రమల  ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమవుతున్నది. ఇందులో ఆహార శుద్ధి పరిశ్రమలు, గోడౌన్లు, మౌళిక సదుపాయాలతో పాటు పంటల ఉత్పత్తుల ఎగుమతులకు బ్యాంకర్లు సహకరించాలి. వ్యవసాయ రంగంలో వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుని యువత ఉపాధి కోసం ఇటు వైపు దృష్టిసారించాలి .. దీనికి బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలి. సహకార రంగానికి నాబార్డు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం. నాబార్డు కార్యక్రమాలకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు.

Related Posts