జామాబాద్ జనవరి 27
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విధానాలను నిరసిస్తూ పలువురు టీఆర్ఎస్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్‌పై దాడి చేయడం అప్రజాస్వామికం అంటూ ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ కవిత భర్త యామాద్రి భాస్కర్ తదితరులు పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ.. టీఆర్‌ఎస్.. డిష్యుం అంటే డిష్యుం అంటున్నాయి. ఇరు పార్టీల నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. పరస్పర భౌతిక దాడులకు తెగబడుతూ.. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో మంగళవారం ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య పరస్పర దాడులకు దారి తీసింది. ఎంపీ తమ నియోజకవర్గానికి వస్తున్నాడని తెలియడంతో.. ఇస్సపల్లి గ్రామం వద్దకు టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలొచ్చి ఎంపీని రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాటతో మొదలైన వివాదం.. ఆ తర్వాత క్రమంగా భౌతిక దాడులకు దారితీసింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలు కాగా.. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి.