YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చిరుధాన్యాలపై చిన్నచూపు వద్దు

 చిరుధాన్యాలపై చిన్నచూపు వద్దు

చిరుధాన్యాలు ఆరోగ్యానికి గొప్ప మేలు చేస్తాయని ఆహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, వరిగెలు, గంటి, చోడి, సామ, కొర్ర, మినుములు, పెసర, బొబ్బర, ఉలవ, సోయబీన్‌లు చేసే మేలు అంతాఇంతా కాదని అంటున్నారు. చిరుధాన్యాలు ఎన్నో పోషక విలువలతో కూడినది. చిరుధాన్యాలుగా గంటి, చోడి, సామ, కొర్ర, వరిగెలు, మినుములు, పెసర, బొబ్బర, ఉలవ, సోయబీన్‌ వంటి పంటలను పిలుస్తారు. వీటిలో ఇనుము, కాల్షియం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే పీచు పదార్థాలు, మినరల్స్‌ ఉండడంతో సులభంగా జీర్ణమయ్యేందుకు తోడ్పతాయి. మనం రోజు తీసుకునే బియ్యంలో వంద గ్రాములకు 33 మిల్లీ గ్రాములు ఉంటే గోధుములలో 30 మిల్లీ గ్రాములు కాల్షియం ఉండగా చోడిలో 350 మిల్లీ గ్రాములు ఉంటుంది. ఇక బియ్యంలో మాంసకృత్తులు 6.8గా ఉంటే , సజ్జల్లో 11.6గా ఉంటాయి. ఇలా అన్నింట్లో చిరుధాన్యాలు అధికంగా ఉండి మెరుగైన ఆరోగ్యానికి తోడ్పతాయని నిపుణులు తేల్చి చెప్తున్నారు. అందుకే ప్రజలు చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. 

 

చిరుధాన్యాలతో చాలామందికి రొట్టెలు, సంకటి, రాగి ముద్ద వంటివి తయారుచేస్తారు. అయితే వీటితో అన్నం, ఇడ్లీలు, దోశెలు, పిండివంటలు, మిఠాయిలు..దాదాపుగా మనం ఇంట్లో తినే అన్ని రకాల పదార్థాలూ   చేసుకోవచ్చు. చిరుధాన్యాల వినియోగంతో మధుమోహం, మలబద్ధకం, అధిగ బరువు తదితర దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తి పొందవచ్చు. కొన్ని వేల రూపాయలను ప్రస్తుతం మందుల రూపేన ఖర్చు చేస్తున్న వారి కోసం చిరుధాన్యాల వల్ల గణనీయమైన మేలు జరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యమూ సిద్ధిస్తుంది.  ఈ ధాన్యాల ఉపయోగాలను దృష్టించి ప్రభుత్వం, ఆరోగ్య విభాగం తగిన ప్రచారం కల్పిస్తే బాగుంటుందన్న సూచనలు ఉన్నాయి. ఇక చిరుధాన్యాలతో చేసిన వంటలతో పెద్దలకే కాదు చిన్నపిల్లలకూ ఆరోగ్యమే. ఆయురారోగ్యాలు ప్రసాదించే ఈ పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహం కూడా అందించాలని ఆహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాలం మారింది. వైద్య విభాగంలో మంచి అభివృద్ధి సాగింది. దీంతో ప్రతీ అనారోగ్యానికి చికిత్స అందుబాటులో ఉంటోంది. అయితే అనారోగ్యాలను దరి చేరనివ్వకుండా ఆరోగ్యవంతమైన జీవితం చిరుధాన్యాల సేవనంతో పొందవచ్చని ఆహారనిపుణులు అంటున్నారు. ఇంకెందుకాలస్యం.. చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోండి మరి.

Related Posts