విజయవాడ, జనవరి 27,
గుడివాడ క్యాసినో సీన్‌తో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. సంక్రాంతి నాటినుంచి టీడీపీ, వైఎస్ఆర్ సీపీ నేతల మధ్య క్యాసినో ఘటనపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఘాటుగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడ పర్యటన అనంతరం.. నివేదికను టీడీపీ అధినేత చంద్రబాబు కు అందించింది. అనంతరం నిజనిర్ధారణ కమిటీ లోని సభ్యులు గురువారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. క్యాసినో వ్వవహారానికి సంబంధించి కరపత్రాలు, పలు వీడియోలు, నృత్యాలు చేసిన 13 మంది యువతుల జాబితా.. వారు ఎక్కడినుంచి వచ్చారు.. మళ్లీ ఎక్కడికి వెళ్లారు.. సమగ్ర వివరాలను, టికెట్లు బుక్ చేసిన వారి వివరాలను నిజనిర్ధారణ కమిటీ బృందం గవర్నర్‌కు అందజేసింది విచారణకు వెళ్లిన సమయంలో తమపై జరిగిన దాడిపై, పోలీసుల వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోరారు. అదేవిధంగా కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు క్యాసినో వ్యవహారంపై చంద్రబాబు రాసిన లేఖను గవర్నర్‌కు అందించినట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. క్యాసినో నిర్వహణపై డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.