గుంటూరు, జనవరి 28,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బీజేపీ అవసరం చాలా ఉంది. భవిష్యత్ లో పార్టీ మనుగడ సాధించాలన్నా, 2024 ఎన్నికల్లో ఆయన విజయం సాధించాలన్నా కమలం పార్టీతో చేతులు కలపడం అవసరం. ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ ది నేషన్ సర్వేలోనూ బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని తేలింది. దీంతో పాటు విపక్షాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడలేని పరిస్థితి దేశంలోనూ ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి బీజేపీతో చేతులు కలపాలన్న ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. అధికారంలో ఉన్న జగన్ ను ఎదుర్కొనాలంటే చంద్రబాబుకు బీజేపీ అండ అవసరం. నెలన్నర క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో రాష్ట్రపతిని కలిసి వెనక్కు వచ్చేశారు. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడి జరిగినా ఎటువంటి కేసులు పెట్టలేదని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేసూ వస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆయనకు బీజేపీ డోర్స్ తెరుచుకుంటున్నట్లు కన్పిస్తున్నాయి. బీజేపీలో తెలుగుదేశం పార్టీని కాదంటున్న వర్గాన్ని ఆ పార్టీ అధినాయకత్వం కొంత పక్కన పెట్టింది. సోము వీర్రాజు బ్యాచ్ ఇటీవల కాలంలో కొంత కంట్రోల్ అయింది. రాష్ట్ర బీజేపీ కూడా అధికార వైసీపీపై మాటల దాడిని ప్రారంభించింది. వరసగా తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు నమోదవుతుండటం, ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుండటంతో చంద్రబాబు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని భావిస్తున్నారు.. ఈసారి పక్కాగా అపాయింట్ మెంట్ తీసుకుని ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారని అంటున్నారు. డీజీపీని రీ కాల్ చేయాలని కోరడం, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆ సమయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అందుబాటులో ఉంటారని భావిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు తన ఢిల్లీ టూర్ ను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారైనా బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ చంద్రబాబుకు లభిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.