YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తెలంగాణ రాకముందు వ్యవసాయం దండగగా ఉంటే...ఇప్పుడు

తెలంగాణ రాకముందు వ్యవసాయం దండగగా ఉంటే...ఇప్పుడు

‘‘ తెలంగాణ రాష్ట్రం రాక ముందు వ్యవసాయం ఎలా ఉండేది...రైతన్నకు సరైన కరెంటు రాక, పొలాలు ఎండిపోయేవి, విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో గంటలు, రోజుల కొద్ది నిలబడాల్సి వచ్చేది, పంట రుణ మాఫీ లేదు, పంట పెట్టుబడి లేదు...రైతును పట్టించుకుంది లేదు...మరి తెలంగాణ వచ్చాక వ్యవసాయం పండగగా మారుతోంది...రైతును రాజు చేయాలన్న ధ్యేయంతో సిఎం కేసిఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. క్యూలో నిలబడే పరిస్థితి లేకుండా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారు. 38 లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశారు. కోటి ఎకరాలను మాగాణగా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. రైతు అప్పు కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన పనిలేకుండా పంట పెట్టుబడిగా ఎకరానికి ఏడాదికి 8000 రూపాయలు ఇస్తున్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఏ ముఖ్యమంత్రి అయినా రైతు గురించి ఇలా ఆలోచించారా? ’’ అని ఉద్వేగ భరితంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.

రైతు బంధు పథకంలో భాగంగా నేడు భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం, రామానుజాపురం గ్రామంలో, వరంగల్ రూరల్ జిల్లా, నర్సంపేట మండలం, బాంజీపేట గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి ఎకరానికి 4000 చొప్పున వచ్చిన చెక్కులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వారికి అందించారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్, బిజెపి పార్టీలు దేశంలో అనేక రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి, మరి తెలంగాణ సిఎం కేసిఆర్ వ్యవసాయం కోసం అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్, రైతుకు 17వేల కోట్ల పంట రుణాలు, కోటి ఎకరాలకు సాగునీరిచ్చే ప్రాజెక్టుల నిర్మాణం, పంట పెట్టుబడి వంటి పథకాల్లో ఏ ఒక్కటైనా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతును పట్టించుకోలేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు కోసం చేసే వాటికి మద్దతివ్వకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాకముందు తాను స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనగామా జిల్లాల్లో ఇదే వేసవి కాలంలో ఉప్పలయ్య అనే రైతు ఎరువులు, విత్తనాల కోసం జనగామాలోని ఒక షాప్ దగ్గర మూడు గంటల సేపు నిలబడ్డారు. తీరా అతను కౌంటర్ వద్దకు వచ్చే సరికి ఎరువులు అయిపోయాయని, పక్క షాపులో ఇస్తున్నారని చెప్పారు. దీంతో ఎరువుల కోసం కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ షాప్ కు పరుగెత్తుతూ మధ్యలోనే ఉప్పలయ్య కుప్పకూలి పోయారు. అక్కడికక్కడే చనిపోయారు. దీంతో అక్కడి ఎమ్మెల్యేగా ఉప్పలయ్యకు న్యాయం చేయాలని తాను ఆందోళన చేపట్టానని, అప్పుడు బుక్ అయినా కేసు ఇంకా ఉందన్నారు. కానీ గత నాలుగేళ్లుగా ఏ ఒక్క రైతు ఎరువులు, విత్తనాల కోసం క్యూలో నిలబడాల్సి వచ్చిందా? అని రైతులను ప్రశ్నించారు. రైతులకు ఎన్ని ఎరువులు, విత్తనాలు కావాలో ముందే అంచనా వేసి వాటిని స్టాక్ చేస్తున్న ఏకైక సిఎం కేసిఆర్ అన్నారు. అదేవిధంగా రైతు పండించిన పంటను వెంటనే మార్కెట్ కు తీసుకెళ్తే సరైన గిట్టుబాటు ధర రావడం లేదని, ధర వచ్చే వరకు వాటిని నిల్వ చేసుకునేందుకు నేడు రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను మండలానికొకటి చొప్పున నిర్మించారన్నారు.  వర్షం పడితే రైతు అప్పుకోసం అక్కడా, ఇక్కడా తిరగాల్సి వస్తోందని, ఎకరానికి పంట పెట్టుబడి ఎంత అవుతుందో అందరితో చర్చించి, నేడు రైతు అప్పుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎకరానికి 4000 రూపాయల చొప్పున రైతు బంధు పథకం కింద చెక్కులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటేనన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ, అభివృద్ధికార్యక్రమాలు తెలంగాణలో సిఎం కేసిఆర్ అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. అందుకే నేడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. పేదింట్లో ఆడపిల్ల పెళ్లి కోసం నాడు 51వేల రూపాయలు ఇచ్చారన్నారు. అవి సరిపోవడం లేదని సిఎం కేసిఆర్ స్వయంగా ఆలోచించి దానిని గత ఏడాది 75వేల రూపాయలకు పెంచారన్నారు. అవి కూడా సరిపోవడం లేదని గుర్తించి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దానిని 1, 00, 116 రూపాయలకు పెంచారని తెలిపారు. పేదింట్లో ఆడపిల్ల పెళ్లికి లక్షా 116 రూపాయలు ఇస్తూ తల్లిదండ్రుల భారాన్ని తగ్గిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా పేదింట్లో ఆడపిల్ల గర్భం దాల్చిన తర్వాత కూడా పనులకు వెళ్లాల్సి వస్తుందని  చూసి చలించిన సిఎం కేసిఆర్ గర్భిణీ మహిళలు ప్రసవానికి మూడు నెలల ముందు, ప్రసవం తర్వాత మూడు నెలలు పనిచేయాల్సిన అవసరం లేకుండా నెలకు 2000 రూపాయల చొప్పున ఆరు నెలలకు 12000 రూపాయలు ఇస్తున్నారన్నారు. ఆడపిల్ల పుడితే మరో 1000 రూపాయలు కలిపి 13000 ఇస్తున్నారని, దీంతో పాటు పుట్టిన బిడ్డకు, తల్లికి అవసరమయ్యే చీరలు, బట్టలు, పౌడర్లు, నూనెలు, దొమతెర, బెడ్డు, న్యాప్కిన్లను కలిపి 15 రకాల వస్తువులతో కేసిఆర్ కిట్ ఇస్తున్నారని చెప్పారు.

కళ్యాణలక్ష్మీ, కేసిఆర్ కిట్ అందుకున్న మహిళలను వేదిక మీదకు పిలిపించి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఎలా ఉన్నాయి, వారికి సరిగా చేరుతున్నాయా? లేదా అని వారిని అడిగి, పథకాలు గురించి వారితోనే సభలో చెప్పించారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.

రామానుజపురంలో రెండువేల జనాభా ఉన్నా...ఇంకా హైస్కూల్ కోసం ఎందుకు అడగలేదని సర్పంచ్ ను, విద్యా కమిటీనీ అడిగి వెంటనే ఆ గ్రామానికి హైస్కూల్ మంజూరు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ ఏడాది నుంచి 8వ తరగతి ప్రారంభించాలని కలెక్టర్ అమేయకుమార్ కు సూచించారు. హైస్కూల్ కోసం 6 అదనపు గదులు, 60 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి రామానుజ పురం నుంచి ఏ ఒక్కరు ప్రైవేట్ పాఠశాలకు వెళ్లొద్దని, ఈ ఊరి నుంచి ప్రైవేట్ స్కూల్ బస్సులు బయటకు వెళ్లొద్దని చెప్పారు. గ్రామస్తులంతా కలిసి కూర్చోని సర్కార్ బడికి పిల్లలను పంపించే విధంగా తీర్మాణం చేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

నర్సంపేట బాంజీపేటలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా బాగా వ్యవసాయం చేస్తున్నారని, అక్కడ డ్రిప్ ద్వారా వ్యవసాయం చేసే మహిళను వేదిక మీదకు పిలిచి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుంతోందని అడిగారు. భద్రమ్మ అనే మహిళ వేదిక మీదకు వచ్చి తనకు ఎకరం  10 గుంటల భూమి ఉందని, ఈ భూమికి అవసరమయ్యే డ్రిప్ మొత్తం ప్రభుత్వమే రూపాయి తీసుకోకుండా ఇచ్చిందని, దాదాపు లక్ష రూపాయలకు పైగా తనకు మేలు జరిగిందని ఆమె చెప్పారు. అదేవిధంగా ఉప్పుడు మల్లయ్య అనే వ్యక్తిని వేదిక మీదకు పిలిస్తే...తన కొడుకు బాసర ఐఐటిలో చదువుతున్నడని చెప్పారు. దీనికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మల్లయ్య కొడుకు మీద ఏడాదికి లక్ష రూపాయల చొప్పున ఆరు సంవత్సరాలకు ఆరు లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చుచేస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అందరికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా పనిచేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని, సిఎం కేసిఆర్ ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్, సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్లు అమేయకుమార్, హరిత, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Related Posts