విజయవాడ, జనవరి 28,
ఒక పక్కన కొత్త పీఆర్సీ వద్దు.. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు.. వారికి ట్రెజరీ సిబ్బంది కూడా మద్దతుగా నిలిచారు. ట్రెజరీ ఉద్యోగులు కూడా పీఆర్సీ ఉద్యమంలో భాగం అయ్యారు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు, పెన్షన్ బిల్లులు ప్రాసెస్ చేయాలని జగమొండి జగన్ సర్కార్ ట్రెజరీ సిబ్బందిపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతోంది. రివైజ్ డ్ పేస్కేల్ కు సంబంధించిన ప్రక్రియను ట్రెజరీ సిబ్బంది ప్రారంభించ లేదు. ఈ నేపథ్యంలో భారత గణతంత్ర దినోత్సవం నాడు సెలవు రోజైనా రాష్ట్ర ఆర్థికశాఖ ఓ సరికొత్త సర్క్యులర్ జారీ చేయడం కలకలం రేపుతోంది. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ సర్క్యులర్ విడుదల చేశారు.ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు, పెన్షన్ బిల్లులను రివైజ్డ్ పే స్కేల్ 2022ను అనుసరించి ప్రాసెస్ చేయాలంటూ ఆ సర్క్యులర్ లో ట్రెజరీ ఉద్యోగులను ఆయన ఆదేశించారు. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం బిల్లుల ప్రక్రియ నిర్వహించకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా ఆ సర్క్యులర్ లో ఎస్ ఎస్ రావత్ హెచ్చరించడం గమనార్హం. చెప్పిన పని చేయకపోతే డీడీఓలు, పీఏఓలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ సూచించింది.గత కొన్ని నెలలుగా వైసీపీ సర్కార్ ఉద్యోగులకు ప్రతి నెలా ఠంచన్ గా ఫస్ట్ తారీఖునే జీతాలు ఇవ్వడం లేదనేది ఇక్కడ ప్రస్తావించదగ్గ అంశం. కొత్త పీఆర్సీ వద్దు, పాత పీఆర్సీ ప్రకారమే తమకు జీతాలు ఇవ్వాలని పట్టుబట్టి, ఫిబ్రవరి 6 నుంచి సమ్మెలోకి వెళ్తున్న ఉద్యోగులపై కక్షతోనే ఏపీ సర్కార్ ఇలా వేధింపుల సర్క్యులర్ జారీ చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు ఫైరవుతున్నారు. జీతాల బిల్లులు ప్రాసెస్ చేయబోమంటున్న ట్రెజరీ సిబ్బందిపై ఇలా సర్క్యులర్ జారీచేయడాన్ని తప్పుపడుతున్నారు. పైగా టైమ్ లైన్ విధిస్తూ.. గురువారం సాయంత్రంలోగా రివైజ్డ్ బిల్లులు అప్ లోడ్ చేయాలని పే అండ్ అకౌంట్స్ విభాగంలోని డీడీఓలకు సర్క్యులర్ లో సూచించడాన్ని ప్రశ్నిస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక శాఖ ఇలా ఒత్తిడి పెంచుతూ సర్క్యులర్ జారీ చేయడంపై పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు ఫైరవుతున్నారు. వేతన సవరణపై అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్ణయించి మధ్యంతర భృతి 27 శాతం కన్నా ఫిట్ మెంట్ తక్కువకు అంటే 14.29 శాతానికే పరిమితం చేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇలా ఐఆర్ కన్నా ఫిట్ మెంట్ తక్కువ ఇచ్చిన దాఖలాలు చరిత్రలో లేవంటున్నారు.ఒక పక్కన ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ.. మరో పక్కన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో జనవరి నెల జీతాలు అందుతాయో లేదో అని పలువురు చిన్నా చితకా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.