హైదరాబాద్, జనవరి 28,
తెలంగాణలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు రిపబ్లిక్ వేడుకలపై స్పష్టంగా కన్పించాయి. సంప్రదాయాలను పూర్తిగా పక్కన పెట్టారు. రాజ్యాంగాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న పోరాటం రిపబ్లిక్ డే వేడుకల్లో కన్పించడమేంటని కంగారు పడుతున్నారా? అవును నిజం. గణతంత్ర వేడుకలు తెలంగాణలో ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి. భవిష్యత్ లో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లుగా వ్యవహారం ఉండనుందన్నది వాస్తవం. రాజ్ భవన్ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జాతీయ జెండా ఎగురవేశారు. కరోనా తీవ్రత కారణంగా ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను రాజ్ భవన్ లోనే నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం గవర్నర్ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉంది. కానీ కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కనీసం మంత్రులు కూడా రాజ్ భవన్ కు దూరంగా ఉన్నారు. గవర్నర్ ఒక్కరే అధికారులతో కలసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో జెండా ఎగురవేశారనుకోండి. అయితే రాజ్ భవన్ కు ఎందుకు రాలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గవర్నర్ తమిళి సై కూడా తన ప్రసంగంలో ఎక్కడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను గురించి ప్రస్తావించలేదు. కోవిడ్ ను అధిగమించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి వంటి వాటిపైనే మాట్లాడారు. దీంతో ముఖ్యమంత్రికి, గవర్నర్ కు మధ్య గ్యాప్ బాగానే ఉందనిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కాలు దువ్వుతున్నారు. బీజేపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అయితే అవి రాజకీయ పోరాటాలు. గవర్నర్ కు వాటితో ఎటువంటి సంబంధం ఉండదు. కానీ గవర్నర్ జరిపిన రిపబ్లిక్ వేడుకలకు సీఎం వెళ్లకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్న విమర్శలు విన్పిస్తున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించలేదని, కనీసం మంత్రులను కూడా పంపకుండా గవర్నర్ ను అవమానించారని పలువురు అంటున్నారు. గతంలో గవర్నర్ గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ తో మాంచి ఫ్రెండ్షిప్ అనేకన్నా... సాన్నిహిత్యం లాంటి స్నేహపూర్వకమైన గురుభక్తిని ప్రదర్శించేవారు అంటే సబబుగా ఉంటుంది. నరసింహన్ సలహాలతోనే కేంద్రంతో కేసీఆర్ సఖ్యంగా మెలిగారని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆయన సూచనలు, సలహాలే కేసీఆర్ పాలనకు వెన్నుదన్నుగా పనిచేశాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేంద్రం ప్రతినిధిగా వ్యవహరించిన నరసింహన్ వేరు.. ఆ తరువాత ఓ ముఖ్యమంత్రిగా కేసీఆర్ తో నరసింహన్ వ్యవహరించిన తీరు వేరు. ఆ రకమైన అవగాహన వల్ల కేసీఆర్-నరసింహన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటైంది. కానీ ఇప్పుడు గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందర రాజన్ తో కేసీఆర్ కు ఎక్కడా పొసగడం లేదని, అందువల్లే వారి మధ్య తీవ్రమైన గ్యాప్ పెరిగిందన్న విమర్శలు బలపడుతున్నాయి. అటు కేంద్రం విధానాలపై, మోడీ నియంతృత్వ పోకడలపై సై అంటే సై అంటున్న కేసీఆర్... ఈ మధ్య తమిళిసై సౌందర రాజన్ ను అస్సలు కలవడం మానేశారని, అధికారిక హోదాలో సైతం గవర్నర్ తో కలిసేందుకు ఇష్టపడటం లేదన్న గుసగుసలు బయటకు పొక్కుతున్నాయి. అందుకు దారితీసిన పరిస్థితులు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. లేటెస్ట్ గా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కాన్వాయ్ మీద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేసిన వార్త బాగా వైరలైంది. నందిపేటలో అభివృద్ధి కార్యక్రమాల కోసం తన అనుచరులు, కార్యకర్తలతో వెళ్తున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అడ్డుకున్నారు. ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దసంఖ్యలో రెండువైపులా కార్యకర్తలు మోహరించడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. అర్వింద్ కారు అద్దాలు పగులగొట్టడంతో పాటు బీజేపీ కార్యకర్త మీదికి ఓ టీఆర్ఎస్ కార్యకర్త కత్తి తీసుకొని పొడవడానికి వెళ్లిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ఘటనపై అర్వింద్ కూడా అక్కడి నుంచే కరీంనగర్ సీపీ సత్యనారాయణకు ఫోన్ చేసి నిలదీశారుమొత్తం మీద ఈరోజు జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు ప్రగతి భవన్, రాజ్ భవన్ ల మధ్య మరింత దూరాన్ని పెంచాయని చెప్పక తప్పదు.