YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హాట్ టాపిక్ గా రెవెన్యూ అధికారుల తీరు....

 హాట్ టాపిక్ గా రెవెన్యూ అధికారుల తీరు....

తిరుపతి, జనవరి 29,
చిత్తూరు జిల్లాలోని కొందరు రెవెన్యూ అధికారుల తీరు హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలోని కొందరు రెవెన్యూ అధికారులపై ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారుల నుంచి వీఆర్వో, వీఆర్‌ఏల వరకు ఎవరకు తోచిన విధంగా వాళ్లు దోచేస్తున్నట్టు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నారు. ఏటా నియోజకవర్గంలో పదుల సంఖ్యలో అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కినా మార్పు లేదు. అప్పట్లో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల భరతం పట్టిన ఏసీబీ అధికారులు.. కిందిస్థాయి ఉద్యోగులపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. తమవరకు ఏసీబీ రాదని అనుకున్నారో.. లేక క్షేత్రస్థాయిలో రాజకీయ అండదండలు ఉన్నాయని భావించారో కానీ.. అవినీతిలో కిందిస్థాయి సిబ్బంది చెలరేగిపోతున్నారట.చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రేడ్‌ వన్‌, గ్రేడ్‌ టు వీఆర్వోలు 70 మంది వరకు ఉన్నారు. వీరిలో కొందరు ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తూ భారీగానే వెనకేసుకుంటున్నట్టు చెబుతున్నారు. వీఆర్వోలకు ప్రభుత్వం జీతం కింద ఇచ్చేదానికంటే.. అనేక రెట్ల అవినీతి సంపాదన వీళ్ల సొంతమట. తిరుపతి రూరల్‌, చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల మండలాల్లో కొందరు వీఆర్వోలు బినామీ పేర్లతో వందల కోట్లు దోచేశారని కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. వీఆర్వోలతో పోటీగా వీఆర్‌ఏలు చేతివాట ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. తిరుపతి, చిత్తూరు జాతీయ రహదారి విస్తరణలో భూముల సేకరణ, పక్కా ఇళ్లు, పట్టదారు పాస్‌పుస్తకాల పంపిణీ రెవెన్యూ అధికారులకు కల్పతరువుగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుక్కలపల్లి-మల్లవరం జాతీయ రహదారి విస్తరణ పనులు VROలకు కాసులు వర్షం కురిపించినట్టు సమాచారం. భూ సేకరణ పేరుతో లేని భూములకు పట్టాలు సృష్టించి ఆ పట్టాలకు నష్టపరిహారం కింద బినామీల పేర్లతో కోట్లు రూపాయలు కొల్లగొట్టారట. పక్కా గృహాల కోసం సేకరించిన భూములలో సైతం అవకాశం ఉన్నంత వరకు వెనకేసుకున్నట్టు చెబుతున్నారు.డికేటి భూములను ఏ,బీ. సీ  కేటగిరీలుగా విభజించిన ప్రభుత్వం మూడు రకాలుగా నష్ట పరిహారం చెల్లించింది. ఇందులో  సీ కేటగిరీలో ఉన్న లబ్ధిదారులతో అధికారులు కుమ్మక్కై ఏ కేటగిరి కింద భారీ మొత్తంలో నష్టపరిహారం అందేలా రికార్డులు మార్చేశారట. చంద్రగిరిలో రెవెన్యూ అధికారుల సంపాదన చూశాక.. ఈ ప్రాంతానికి బదిలీపై రావడానికి కొందరు అవినీతి అధికారులు పెద్ద ఎత్తున పైరవీలు చేసినట్టు సమాచారం. అక్కడ పోస్టింగ్‌ ఇప్పిస్తే.. వచ్చే దాంట్లో వాటా ఇస్తామని బేరం పెట్టేశారట ఇంకొందరు. విషయం ఆ నోటా.. ఈ నోటా బయటకు పొక్కడంతో అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టికి ఇక్కడి బాగోతం వెళ్లిందట. పైనుంచి కిందిస్థాయి వరకు ఎవరెంత సంపాదించారు? ఎక్కడెక్కడ అక్రమాస్తులు కూడబెట్టారు? బినామీలుగా ఉన్నదెవరో కూపీ లాగుతున్నట్టు సమాచారం. ఈ విషయం అక్రమార్కులకు తెలియడంతో జాగ్రత్తపడుతున్నారట. ముందు జాగ్రత్తగా ప్రజాప్రతినిధుల చెంతకు వెళ్లి.. అభయ హస్తం కోరుతున్నట్టు సమాచారం. అయితే ప్రలోభాలకు లొంగకుండా  ఏసీబీ గట్టిగా ప్రయత్నిస్తే.. చంద్రగిరి రెవెన్యూ శాఖలో అవినీతి గుట్టలు గుట్టలుగా బయటపడుతుందని చెబుతున్నారు. మరి.. అక్రమాల అంతు తేలుస్తారో లేక చీకటి హస్తాలకు ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌ అంటారో చూడాలి

Related Posts