హైదరాబాద్, జనవరి 29,
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ఫ’. రష్మిక హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చినా జనాలు థియేటర్లలోనే ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లోనూ బన్నీ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. హిందీలో ఎక్కువగా ప్రమోట్ చేయకపోయినా, కేవలం డబ్బింగ్ వెర్షన్‌తోనే రికార్డుల మోత మోగించేస్తోంది. ఈ క్రమంలో పుష్ప హిందీ వెర్షన్ 100 కోట్లను కలెక్ట్ చేసిందని బాలీవుడ్ నటుడు, ప్రముఖ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ వెల్లడించారు.‘పుష్ప’ హిందీ వెర్షన్ 100 కోట్ల బిజినెస్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ గొప్ప రికార్డు అందుకున్నందుకు బన్నీకి అభినందనలు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ అని చెప్పుకునే ఎంతో మందికి ఇది చెంపపెట్టు లాంటిది. వారి స్ట్రెయిట్ సినిమాలు కేవలం 25 కోట్ల వసూళ్లు సాధించడానికి నానా తంటాలు పడుతున్నాయి. అలాంటిది ఒక తెలుగు డబ్బింగ్ చిత్రం 100 కోట్ల కలెక్షన్లను రాబట్టగలిగింది. బాలీవుడ్ సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎందుకు తిరస్కరిస్తున్నారో ‘పుష్ప’ నే ప్రత్యక్ష నిదర్శనం’ అని వరుసగా ట్వీట్లు పెట్టాడు కేఆర్ కే. కాగా ఈ సినిమాను హిందీలో డిస్ట్రి బ్యూట్ చేసిన గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ అధినేత మనీశ్ షాకు బన్నీ బంగారు గనిగా మారిపోయాడని మరో ట్వీట్ లో రాసుకొచ్చారు