పానాజీ, జనవరి 29,
గోవాలో కాంగ్రెస్ ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం, ఓటమి అనేదే లేకుండా 11 సార్లు వరుసగా గెలిచిన తిరుగులేని అభ్యర్థి ప్రతాప్ సిన్హ్ రాణే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నారు. 87 ఏళ్ల వయసున్న ఆయనపై తన కోడలే బీజేపీ నుంచి బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ప్రతాప్ సిన్హ్ రాణే. అయితే తాను వెనక్కి తగ్గడానికి కారణం వయోభారమే తప్ప కుటుంబ ఒత్తిడి కాదని తెలిపారు.గోవాలోని పోరియెమ్ నియోజకవర్గం నుంచి ప్రతాప్ సిన్హ్ రాణే వరుసగా 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఒక్కసారి కూడా ఓటమి చవిచూడలేదు. ఫిబ్రవరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన్నే బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ప్రతాప్ సిన్హ్ రాణేను పార్టీ అభ్యర్థిగా డిసెంబర్‌లోనే కాంగ్రెస్ ప్రకటించింది. అయితే గత వారంలో బీజేపీ అదే నియోజకవర్గం నుంచి ఆయన కోడలు దేవియా విశ్వజీత్ రాణేను అభ్యర్థిగా ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ తరఫున గోవాకు సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన చరిత్ర ఉన్న నేత ప్రతాప్ రాణే. ఆయన కుమారుడు విశ్వజీత్ రాణే ప్రస్తుత బీజేపీ సర్కారులో మంత్రిగా ఉన్నారు. వాస్తవానికి విశ్వజీత్ కూడా 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫునే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన బీజేపీలోకి మారారు. ఆ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో పొరియెమ్ నియోజకవర్గం నుంచి ప్రతాప్ రాణే పైనే విశ్వజీత్‌ను పోటీకి నిలపాలని బీజేపీ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తండ్రి, కొడుకుల సవాల్‌పై ఆ తర్వాత వెనక్కి తగ్గిన బీజేపీ.. దానికి పొరుగునే ఉన్న వల్‌పోయ్ నియోజకవర్గాన్ని విశ్వజీత్‌కు కేటాయించింది. అయితే ఆయన భార్య డాక్టర్ దేవియా విశ్వజీత్ రాణేను పోరియెమ్ నుంచి బరిలోకి దించింది బీజేపీ.కాగా, ప్రతాప్ రాణే పొరియెమ్ సీటు నుంచి పోటీ చేయకుంటే ఆ స్థానంలో అభ్యర్థి ఎవరనేది ఆయనే నిర్ణయించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం అన్నారు. దాదాపు 50 ఏండ్లుగా ఆ నియోజకవర్గం పేరు చెబితే ఆయనే గుర్తొచ్చే అంతగా అనుబంధాన్ని పెనవేసుకున్నారని, అక్కడి ఆయనే పోటీ చేయాలని, లేదా పోటీ ఎవరు చేయాలన్నది ఆయనే పేరు సూచించాలని చెప్పారు.