హైదరాబాద్, జనవరి 29,
ఈనెల 31 నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తారా? లేక సెలవులను పొడిగిస్తారా?అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలవులను పొడిగించేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. పాఠశాలలు, కాలేజీలన్నింటికీ ఫిబ్రవరి ఆరో తేదీ వరకు సెలవులను పొడిగించాలని ప్రభుత్వం సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది. వచ్చేనెల మొదటివారంలో కరోనా తీవ్రత పెరుగుతుందనీ, కేసుల నమోదు ఎక్కువవుతుందంటూ ప్రభుత్వానికి ఇప్పటికే వైద్యఆరోగ్య శాఖ నివేదిక సమర్పించినట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈనెల 30 వరకు సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఈనెల 8 నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి.
విద్యార్థులకు భౌతిక తరగతులు నిర్వహించడం లేదు. ఈనెల 31 నుంచి విద్యాసంస్థలను ప్రారంభించాలంటే ఇప్పటికే కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లకు సంబంధించిన పనులు ప్రారంభం కావాలి. ఇంకా రెండు రోజులే సమయమున్నది. అయినా పాఠశాల, ఇంటర్, కళాశాల విద్యాశాఖలతోపాటు విశ్వవిద్యాలయాల్లోనూ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇంకోవైపు ఎనిమితో తరగతి నుంచి కాలేజీ, వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్, టీశాట్ ద్వారా పాఠాలు ప్రసారమవుతున్నాయి.అయితే తల్లిదండ్రుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విద్యాసంస్థలను తెరవాల్సిందేనని కొందరంటే, కరోనా తీవ్రత ఉన్నందున సెలవులను పొడిగించాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సైతం బడులను తెరవాలని కోరుతున్నాయి. ఎనిమిది నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని ఇంకొందరు తల్లిదండ్రులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇలా రకరకాలుగా అభిప్రాయాలు వినిపిస్తున్నా కరోనా తీవ్రత, విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వచ్చేనెల ఆరో తేదీవరకు సెలవులను పొడిగించేందుకే ప్రభుత్వం సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది.