YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివాదాల విశాఖ టీడీపీ

వివాదాల విశాఖ టీడీపీ

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఇప్పుడు విశాఖ జిల్లాలోని పసుపు రాజకీయాల్లో ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంటోందట! ఎప్పటినుంచో స్నేహితులైన నేతల మధ్య సెగలు రేగుతున్నాయట. తెలుగుదేశం పార్టీకి విశాఖ కంచుకోటతో సమానం. ఒకప్పుడు టీడీపీతోనే రాజకీయ రంగప్రవేశం చేశారు గంటా శ్రీనివాసరావు. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లారు. అక్కడినుంచి కాంగ్రెస్‌లోకి జంప్‌ చేసి తిరిగి తెలుగుదేశం కండువా కప్పేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. తొలినాళ్లలో గంటాను టీడీపీలోకి తీసుకువచ్చింది అయ్యన్నపాత్రుడు. ప్రస్తుతం ఆయన కూడా ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆరంభంలో వీరిద్దరు మంచి స్నేహితులు. అయితే క్రమంగా వీరు శత్రువుల్లా మారారు. ఇదే పరిణామం జిల్లాలో మరోసారి తలెత్తే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడున్న తన మార్క్‌ని చూపించాలనుకుంటారు. తెలుగుదేశం నుంచి పీఆర్పీలో చేరిన సమయంలో ఆయనతో పాటు అవంతీ శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకటరామయ్య సహా పలువురు నేతలు వచ్చారు. అనకాపల్లి నుంచి గంటా, భీమిలీ నుంచి అవంతీ శ్రీనివాస్‌, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్‌బాబు, గాజువాక నుంచి చింతలపూడి వెంకటరామయ్య గెలుపొందారు. మారిన పరిణామాల తర్వాత గంటాతో పాటు వీరంతా కాంగ్రెస్‌ పార్టీలోకి, అక్కడి నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. ఎన్నికల్లో గంటా తన వర్గానికి సీట్లు సాధించుకోగలిగారు. గంటా భీమిలీ నుంచి, రమేష్‌బాబు యలమంచిలి నుంచి గెలుపొందగా, అవంతీ శ్రీనివాస్ అనకాపల్లి ఏంపీగా పోటీచేశారు. అప్పట్లోనే ఏంపీ స్థానంలో గెలుపుకోసం అయ్యన్నతో అవంతీ కలిసి పనిచేశారు.

అవంతీ శ్రీనివాస్ అటు అయ్యన్న, ఇటు గంటా శ్రీనివాస్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నారు. చాలా వేదికలపై టీడీపీ ఎంపీగా తన వాయిస్‌ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు సమావేశాలకు తనకు సమాచారం ఇవ్వలేదంటూ అధికారులపై చిందులేశారు. ఎన్ని చేసినప్పటికీ ఆయన గంటా వర్గంగానే కొనసాగుతూ వచ్చారు. అయితే ఇటీవల గంటా, అవంతీ మధ్య టెర్మ్స్‌ బాగాలేవని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. రైల్వేజోన్‌పై ఐక్య కార్యాచరణ వేదిక విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి.

ఇటీవల మంత్రి గంటా ఆధ్వర్యంలో రైల్వేజోన్‌తోపాటు ఇతర విభజన హామీల సాధన సమితి ఏర్పాటుకోసం భేటీ జరిగింది. దీనికి వివిధ ప్రజాసంఘాల నేతలు, రాజకీయపార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు. పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే దీనిపై తనకు సమాచారం లేదని ఎంపీ అవంతీ శ్రీనివాస్‌ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తంచేశారు. వారం తర్వాత మళ్లీ ఒక హోటల్‌లో ఇదే అంశంపై కార్యాచరణ కోసం సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమయంలోనే ఎంపీ అవంతీ శ్రీనివాస్‌ రైల్వేజోన్‌ కోసం రైల్వేస్టేషన్‌లోనే మెరుపుదీక్ష చేపట్టారు. జోన్‌ విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరిపై గట్టిగా ఫైర్‌ అయ్యారు. మంత్రి గంటా ఆధ్వర్యంలో జరుగుతున్న జేఏసీ నుంచి సమాచారం అందకపోవడంతోనే అవంతీ శ్రీనివాస్‌ ఆగ్రహించారనీ, అందుకే ఆయన రైల్వేస్టేషన్‌ వద్ద మెరుపు దీక్ష చేపట్టారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. దీనిపై మంత్రి గంటాను పాత్రికేయులు ప్రశ్నిస్తే.. రైల్వేజోన్‌ సహా విభజన హామీల సాధన సమితి సమావేశాలకు ఆహ్వానాలు పంపింది జేఏసీ సభ్యులేననీ, వివరణ వారినే ఆడగండి అంటూ సమాధానమిచ్చారు. ఏంపీ అవంతీ దీక్షకు కూడా తమ మద్దతు ఉంటుందని గంటా చెప్పుకొచ్చారు.

 ఎంపీ అవంతీ ఏ చిన్న కార్యక్రమం చేసినా మంత్రి గంటా హాజరవుతుంటారు. అలాంటిది రైల్వేజోన్‌ కోసం ఆ స్థాయిలో దీక్ష చేపడితే గంటా ఎందుకు రాలేదబ్బా..! అంటూ రాజకీయ నేతలు తెగ చర్చిస్తున్నారు. ఏంపీ అవంతీ దీక్ష చేపడుతున్నారని చెప్పగానే పలువురు ఎమ్మెల్యేలు మద్దతుగా వచ్చారు. మరీ అవంతీ వైపు నుంచి మంత్రి గంటాకు ఆహ్వనం వెళ్లిందా లేదా అనేది తెలియడం లేదు. "గంటాను ఆయన పిలవ లేదా? పిలిచినా ఆయన రాలేదా? ఇద్దరి ఆశయం రైల్వేజోన్ రావాలనే కదా? మరి మంత్రి గంటా రాలేదంటే వీరి మధ్య ఏదో తేడా కొట్టిందని తేలిపోయింది'' అంటూ కొందరు పసుపు నేతలు ముచ్చట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే, అయ్యన్నపాత్రుడు వర్గంగా ఉన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అవంతీ శ్రీనివాస్‌ దీక్షకు మద్దతుగా నిలిచారు. ఆయనతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ దృశ్యం చూసిన వాళ్లంతా అవాక్కయ్యారు. జిల్లాలో మళ్లీ కొత్త రాజకీయం మొదలైందంటూ ప్రజలు చెప్పుకుంటున్నారు. 

Related Posts