హైదరాబాద్, జనవరి 31,
హైదరాబాద్ రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. గతంలో ఫేమ్ పథకం కింద ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని నష్టాలపాలైన ఆర్టీసీ, ఈసారి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గుచూపింది. ఫేమ్–2 పథకం కింద గతంలో మంజూరైన 325 ఏసీ బస్సులు వదులుకున్న ఆర్టీసీ, ఆ కేటాయింపులో భాగంగా నాన్ ఏసీ బస్సులు తీసుకోవాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా చేసే బాధ్యతను కేంద్రం ఇటీవల తన అధీనంలోని ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) అనుబంధ సంస్థ అయిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్‌ఎల్)కు అప్పగించింది.ఆ సంస్థ తాజాగా 5,580 బస్సులకు టెండర్లు పిలిచింది. హైదరాబాద్‌కు 300 బస్సులను కేటాయించింది. 2019 ఆర్టీసీ సమ్మె తర్వాత దాదాపు వెయ్యి బస్సులను హైదరాబాద్‌లో తగ్గించారు. మరో వెయ్యి బస్సులు కాలం చెల్లి తుక్కు కింద మారిపోయాయి. మరోవైపు నగరశివారులో కొత్త కాలనీలు విస్తరించి జనాభా పెరగటంతో రవాణా సౌకర్యం మెరుగుపర్చాల్సిన అవసరం ఏర్పడింది. పెరిగిన అప్పుల కారణంగా దివాలా దశగా పయనిస్తున్న ఆర్టీసీకి బస్సులు కొనే స్థోమత లేదు. దీంతో పాత బస్సులతోనే నెట్టుకు రావాల్సి వస్తోంది. అయితే, వీటి వల్ల వాయుకాలుష్యం పెరిగిపోతుండటం గమనార్హం. మరోవైపు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు పెంచుకోవాలని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం విమానాశ్రయానికి తిప్పుతున్న ఏసీ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో అద్దెకు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ బస్సులను ఒలెక్ట్రా కంపెనీ తిప్పుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చే నాన్ ఏసీ బస్సులను కూడా జీసీసీ పద్ధతిలోనే తీసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఏసీ బస్సులకు చెల్లిస్తున్న అద్దె అంతే కొత్త కంపెనీలు కూడా కోట్ చేస్తాయని ఆర్టీసీ భావిస్తోంది.