YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివాదాలు వీడరా..?

వివాదాలు వీడరా..?

మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. బరిలో నిలిచే నాయకులు జనం మధ్యకు వెళుతున్నారు. ప్రత్యర్థులను చిత్తుచేసే ఎత్తులు వేస్తున్నారు. ఈ కీలక ఈ సమయంలో నాయకులంతా సమష్టిగా పని చేయాలి. అయితే.. టీడీపీ నాయకులు మాత్రం విభేదాలతో కాలు దువ్వుకుంటున్నారు. అధినేత హెచ్చరించినా వారు దారికి రావడం లేదు. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్య నాయకుల తీరుతో ద్వితీయశ్రేణి ఆందోళన చెందుతోంది.

ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ, ఏపీఆర్‌ఐసీ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఏవీ సైకిల్‌ యాత్రపై రాళ్లదాడిని సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. మంత్రి అఖిల, ఏవీతో అమరావతిలో చర్చలు జరిపారు. కలిసి పని చేస్తామని ఇరువర్గాలు ప్రకటించినా.. ఇప్పటికీ వారిద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఘటనలు లేవు. ఎవరికి వారే తమ వర్గాలను బలోపేతం దిశగా పావులు కదుపుతున్నారు. నంద్యాలలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌, ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు ఎవరికి వారే అన్నట్లు సాగిపోతున్నారు. వారి మధ్య సయోధ్యకు అధినాయకత్వం చేపట్టిన చర్యలు నామమాత్రమే. ఉప ఎన్నికల్లో బలంగా పని చేసిన కొందరు నాయకులు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

కర్నూలు నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య సైలెంట్‌ వార్‌ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ తనకేనని ఎమ్మెల్యే ఎస్వీ బహిరంగంగానే ప్రకటించారు. అయితే టీజీ తన కుమారుడు టీజీ భరత్‌ను బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. టికెట్‌ ఎవరికో పక్కా హామీ ఇవ్వలేదని, సీఎం సర్వే ప్రకారం గెలిచే అవకాశాలు ఉన్న వారికే ఇస్తారని టీజీ వర్గీయులు అంటున్నారు. అవకాశం ఇస్తే పోటీ తథ్యమని టీజీ భరత్‌ స్పష్టం చేస్తున్నారు. టికెట్‌ విషయంలో ఈ రెండు వర్గాల మధ్య అంతర్గతంగా విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఎవరికి వారే తమ వర్గాలను బలోపేతం చేసుకుంటున్నారు. ఫలితంగా వార్డు నాయకులు సైతం కలిసి పనిచేయలేని పరిస్థితి ఉంది.

కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మణిగాంధీ, టీడీపీ ఇన్‌చార్జి విష్ణు వర్గాలు ప్రత్యక్ష యుద్ధమే చేసుకుంటున్నాయి. 2014 ఎన్నికల తర్వాత విష్ణువర్దన్‌రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. 2016లో ఎమ్మెల్యే మణిగాంధీ టీడీపీలో చేరారు. ఈ చేరికను విష్ణు వర్గం వ్యతిరేకించింది. ఇద్దరు సమన్వయంతో పని చేయాలని చంద్రబాబుతో పాటు నాటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, నేటి ఇన్‌చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు చేసిన ప్రయత్నాలు పలించ లేదు. పార్టీ కార్యక్రమాలు ఎవరికి వారే చేపడుతున్నారు. ఇటీవల కోడుమూరు ఎంపీడీవో బదిలీ వ్యవహారం ఈ రెండు వర్గాల మధ్య మరింత ఆజ్యం పోసింది. పత్తికొండ నియోజకవర్గంలో కేఈ కుటుంబానికి, శాలివాహన ఫెడరేషన్‌ ఛైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ కార్యక్రమాలకు తనను, తన భార్య, తుగ్గలి జడ్పీటీసీ వరలక్ష్మిని పిలవడం లేదని, కావాలని తమను దూరం పెడుతున్నారని నాగేంద్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Related Posts