విజయవాడ, జనవరి 31,
ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే ఉద్యోగులు చర్చలకు వస్తామని చెబుతున్నారన్నారు. జీవోలు విడుదల అయినందున ప్రభుత్వం కొత్త జీతాలను ఇస్తుందన్నారు. ఉద్యోగులు ముఖ్యమంత్రి పై తూలనాడి మాట్లాడితే సంఘం నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మేము కూడా మాట్లాడితే మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారుఅది మేము కోరుకోవడం లేదన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే పర్యవసానాలు చూడాల్సి వస్తుందని మంత్రి ఉద్యోగులను హెచ్చరించారు. మొదటి తేదీ నుంచి ఎంత మందికి వీలైతే అంతమందికి జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పాత జీతాలు కావాలంటారు… మొదటి తేదీన జీతాలు వేసే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అంటున్నారు.ఇది ద్వంద్వ వైఖరి కాదా అంటూ ఉద్యోగులను మంత్రి ప్రశ్నించారు. జీతాలు ప్రాసెస్ చేయని సిబ్బంది, అధికారుల పై ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇవన్నీ క్రమ శిక్షణా చర్యల్లో భాగమే.. టీడీపీకి టైం బాలేదు. దీక్షలు వాళ్లే చేస్తున్నారు. వాళ్ల నాయకులే అత్యాచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
పీఆర్సీ సాధన కమిటీ సమావేశం
ఏపీలో పీఆర్సీపై స్పష్టత రావడం లేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అయితే ఉద్యోగసంఘాలను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే పలుమార్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను పీఆర్సీపై చర్చలకు రావాలని ఆహ్వానించింది. అయితే ఇప్పటివరకు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్ళలేదు. అయితే తాజాగా ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే అంశంపై చర్చించేందుకు నేడు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ కానుంది. మంత్రుల కమిటీ ముందు మరోసారి తమ ప్రతిపాదనలు ఉంచే ఆలోచన చేయనున్నారు. మంత్రుల కమిటీ ముందు భేటీకి వెళ్లే అంశంపై ఉద్యోగ సంఘాల నేతలు తర్జన భర్జన అవుతున్నట్లు తెలుస్తోంది. పీఆర్సీ జీవోల రద్దు,అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్,పాత జీతాల పై మంత్రుల కమిటీకి ప్రతిపాదనలు ఇచ్చే ఆలోచనలో ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సెక్రటేరియట్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. సచివాలయంలోని మూడు బ్లాక్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు సచివాలయ ఉద్యోగులు నిరాహార దీక్షకు దిగుతున్నారు.