బెంగళూరు, జనవరి 31,
దివ్యాంగులంటే కాసింత దయ, కరుణ వుండాలి. కానీ బెంగళూరులో ఓ ఖాకీ దివ్యాంగురాలైన ఓ మహిళ పట్ల కాఠిన్యం ప్రదర్శించారు. బెంగళూరు పోలీసు మాత్రం కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించారు. బెంగళూరు సిటీలో ఓ మహిళ దివ్యాంగురాలు. ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను ట్రాఫిక్ టోయింగ్ వాహనంపై తరలిస్తుండగా వాటిని అడ్డుకుందో మహిళ. అంతేకాదు ఆ వాహనాలను తీసుకెళుతున్న టోయింగ్ వెహికల్ పై రాళ్ళు వేసింది. ఆమె వేసిన ఓ రాయి అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ నారాయణ కంటికి కొంచెం తగిలింది. దీంతో సహనం కోల్పోయిన ఎఎస్ఐ తన ప్రతాపం చూపించాడు.దివ్యాంగురాలు అని కూడా చూడకుండా బూటుకాలితో తన్నుతూ ఆమెపై తన ప్రతాపం చూపించాడు. ఇష్టం వచ్చినట్టు తన్నుతూ ఆమెను హింసించాడు. ఈ తతంగాన్ని ఓ జర్నలిస్ట్ వీడియో తీశాడు. పోలీసుల తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. ఆమెపట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాదు రివర్స్ కేసు ఫైల్ చేశాడా పోలీస్. ఆమెపై సెక్షన్ 332, 353 కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. విధి నిర్వహణలో వున్న తనను తన విధులు నిర్వహించకుండా అడ్డుకుందని, ఉద్దేశపూర్వకంగా గాయపరిచిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి ఘటనలు కొత్తేం కాదు. గతంలో యూపీలోనూ జరిగాయి. టూ వీలర్ పై వెళుతున్న ఓవ్యక్తి చెంపపై చెళ్ళుమనిపించాడో పోలీస్ అధికారి. తన పిల్లాడితో కలిసి వెళుతున్న వ్యక్తిపై విచక్షణరహితంగా దాడిచేశాడు. తనను కొట్టవద్దని ప్రాధేయపడినా ఆ పోలీసు పట్టించుకోలేదు. పిల్లాడిని కూడా వదలలేదు. ఈ ఘటన సంచలనం కలిగించింది. ఈ వీడియో చూసిన ఉన్నతాధికారులు ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు.కేరళలోనూ ఇలాంటి సంఘటన జరిగింది. రైలులో స్లీపర్ కంపార్ట్ మెంట్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని చితకబాదాడు ఓ కానిస్టేబుల్. తనను కొట్టవద్దని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. అతనిపై తన ప్రతాపం చూపించాడు. ఆ పాసింజర్ చేసిన తప్పేంటంటే జనరల్ టికెట్ కొని, స్లీపర్ కోచ్ లో ప్రయాణించడమే జనవరి2, 2022న జరిగిన ఈ ఘటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.