YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నష్టాన్ని పట్టించుకోరా..?

నష్టాన్ని పట్టించుకోరా..?

ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల క్రితం గాలివాన సృష్టించిన బీభత్సానికి చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. వందల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు విరిగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరంగల్‌లోని దేశాయిపేట, పోచమ్మమైదాన్‌, శివనగర్‌, కరీమాబాద్‌, శంభునిపేట తదితర ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించేందుకు రెండు  రోజులు పట్టింది. ఇది ప్రకృతి విపత్తే అయినా, తరచి చూస్తే అనేక లోపాలు బయటపడుతున్నాయి. పాలకాలం నాటి స్తంభాలపై తీగలు వదులుగా ఉండడం, లైన్ల నిర్మాణంలో నాణ్యతను పాటించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, చెట్ల కొమ్మలు విరిగి పడడం లాంటి ఘటనలతో నష్టం భారీగా జరిగింది.

ప్రభుత్వం విద్యుత్తు రంగంపై ప్రత్యేక దృష్టిసారించింది. వ్యవసాయానికి సైతం 24 గంటల పాటు సరఫరా ఇవ్వాలని పంపిణీ సంస్థలకు సూచించింది. ఇందుకనుగుణంగా ఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో కొత్త లైన్లు, ఉపకేంద్రాలు, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, డీటీఆర్‌ల నిర్మాణం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు, పట్టణాలకు మెరుగైన విద్యుత్తును అందించేందుకు పదేళ్లుగా భారీగా నిధులు వస్తున్నాయి. వీటిని వినియోగించుకొని పాత స్తంభాలు, తీగలను తొలగించి కొత్తవి నిర్మించడంతోపాటు నాణ్యతను పాటిస్తే విపత్తులు వచ్చినప్పుడు సైతం సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుంది. అయినా పూర్తిస్థాయిలో లైన్లను పరిపుష్ఠి చేయలేదని తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకు వంగిపోయి ఉన్నాయి. వీటికి తీగలు వదులుగా వేలాడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో నేలను తాకే విధంగా కిందికి రావడంతో రైతులే ఊత కర్రలను పెట్టుకుంటున్నారు. ఇలాంటి చోట్ల గాలిదుమారాలు వచ్చినప్పుడు తీవ్ర స్థాయిలో నష్టం చోటుచేసుకొంటోంది.

తాజాగా విరిగిన స్తంభాలను పరిశీలిస్తే ఎక్కువగా పాతవే ఉన్నాయి. వీటితోపాటు కొన్ని కొత్తవీ విరిగాయి. పాతేప్పుడు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణంగా కనిపిస్తోంది. 8 మీటర్ల పోల్‌ ఎత్తేప్పుడు - 5 అడుగుల గుంత, 9.1 మీటర్ల పోల్‌ నిలబెట్టేప్పుడు  6 అడుగుల గుంతను తీసి అవసరమైతే కాంక్రీటు వేయాల్సి ఉంటుంది. లైన్ల నిర్మాణంలో మలుపుల వద్ద స్టే వైర్లను వేయాలి. గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా దీనిపై సరైన పర్యవేక్షణ లేక కొత్తవీ కొంతకాలానికే ఒరిగిపోతున్నాయి. విరిగిపోతున్నాయి.

గాలివాన ధాటికి ఐదు జిల్లాల్లో 1336 స్తంభాలు విరిగినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. 33కేవీ లైన్‌ స్తంభాలతోపాటు, 133 కేవీ లైన్ల కోసం నిర్మించిన టవర్లు సైతం వంగిపోవడాన్ని బట్టి చూస్తే నాణ్యతను గాలికొదిలేసినట్టు కనిపిస్తోంది. జనగామ జిల్లా పాలకుర్తి మండల పరిధిలోనే సుమారు 35 స్తంభాలు నేలకొరిగాయి. గ్రామీణ జిల్లాలోని పరకాల మండలంలోనూ భారీగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం సంస్థకు రూ. కోటికిపైగా నష్టం వాటిల్లింది.

Related Posts