వైజాగ్, ఫిబ్రవరి 1,
చివరి మజిలి శ్మశాన వాటికలు సమస్యలు నెలవుగా మారాయి. భీమిలి, తగరపువలసల్లో ఉన్న శ్మశాన వాటికల్లో సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మెరపెట్టు కున్నా పట్టించుకోవడంలేదు. ఏ శ్మశానాల్లో చూసినా పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో, చుట్టూరా అపరిశుభ్రతతో నిండి ఉన్న దృశ్యాలే దర్శిన మిస్తున్నాయి. భీమిలి, తగరపు వలసల్లో ఉన్న శ్మశానాల్లో సమస్యలకు నెలవులుగా ఉన్నాయి. కనీసం దహన సంస్కారాలకు మృతదేహాన్ని తీసుకెళ్లిన బంధువులు సేద తీరే షెల్టర్లు ఎక్కడా కానరాలేదు. వర్షం కురిసిన, ఎండ కాసిన, అనేక ఇబ్బందుల్లో దహన సంస్కారాలు చేస్తున్నారు. పలు శ్మశాన వాటికల స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా అధికారులకు పట్టడంలేదు. చిట్టివలస జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు, గుడివాడకు వెళ్లే గొస్తనీ వంతెన సమీపంలో ఉన్న శ్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురికాకుండా ప్రహారీ నిర్మించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కొంతకాలంగా చేసిన వినతులు, విజ్ఞప్తులకు స్పందించిన అధికారులు ఎట్టకేలకు ప్రహారి నిర్మాణానికి రూ. 30 లక్షలతో ప్రహారి నిర్మించారు. కానీ దానిలో కూడా నాణ్యత కొరవడిందంటూ కొంతమంది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్మాణానికై మంజూరు చేసిన రూ. 30 లక్షల్లో, కేవలం రూ. 20 నుంచి 23 లక్షలు మాత్రమే ఖర్చు అయినట్లుగా స్థానికులు వాపోతున్నారు. శ్మశాన వాటిక చుట్టూర ప్రహారీ అయితే నిర్మించారు, గానీ మౌలిక సదుపాయాలు మచ్చుకు కూడా కానరాని పరిస్థితి, ప్రహారీ కూడా చుట్టూరా నిర్మించకపోవడంతో అనివార్యంగా అపరిశుభ్రత నెలకొని ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. సౌకర్యాల కల్పనకు సత్యసాయి సేవా సమితి, ఇతర పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చిట్టివలస, భీమిలి బ్యాంక్ కాలనీ, సమీపంలో షెడ్లు, మంచినీటి బోర్లు నిర్మించారు.