YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ధర ఢమాల్..

ధర ఢమాల్..

ఎర్రజొన్నల మాదిరే ఒప్పంద సేద్యం చేస్తున్న సజ్జ పంటకు ధరాఘాతమే ఏర్పడింది. మరో వారం రోజుల్లో కోతలు పూర్తి కానున్నా నేపథ్యంలో సిండికేటైన వ్యాపారులు ఎలా వ్యవహరిస్తారనే ఆందోళన రైతుల్లో మొదలైంది. గిట్టుబాటు ధర లేకపోవడంతోపాటు దిగుబడులు తగ్గడం, చీడపీడలు రావడం, నీటి లభ్యత లేకపోవడం ఈ సాగుకు రైతులు క్రమంగా దూరమవుతున్నారు. విత్తే ముందే ధర ఖరారు చేసుకొన్నా ఏ మేరకు కొంటారనేది ఇంకా తేలలేదు. అయితే క్వింటాకు రూ. 500 - రూ. 1000 పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలోని ఆర్మూర్‌, వేల్పూర్‌,   బాల్కొండ, మోర్తాడ్‌, మెండోరా, ముప్కాల్‌, జక్రాన్‌పల్లి, కమ్మర్‌పల్లి మండలాల్లో ఈ పంట ఎక్కువగా సాగు చేస్తారు. పసుపు కోతలు పూర్తికాగానే రైతులు సజ్జ పంటకు వెళ్తారు. నీరు సమృద్ధిగా ఉన్న చోటనే దీన్ని ఎంచుకొంటారు. అయితే ఒక్కప్పుడు 8-10 వేల ఎకరాలున్న సాగు ఇప్పుడు రెండు వేలకు పడిపోయింది. గతంలో ఎకరాకు సగటున 12 క్వింటాళ్లకు తక్కువ కాకుండా వచ్చే దిగుబడి ఇప్పుడు 8 క్వింటాళ్లకే పరిమితమవుతోంది. విత్తన నాణ్యత లోపించడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య పండించాలంటేనే అన్నదాత సాహసించడం లేదు.

గత రెండేళ్ల క్రితం క్వింటాలు రూ. 5 వేలున్న ధర ఇప్పుడు రూ. 3500 - రూ. 3700 వరకు కొంటున్నారు. గతేడాదైతే కేవలం రూ. 3 వేలకే పరిమితం చేశారు. సీడ్‌ వ్యాపారులుగా (ఆర్గనైజర్లు) చలామణి అవుతున్న కొందరు విత్తనమిచ్చి ముందే ధర ఖరారు చేసుకొని ఒప్పందం చేసుకుంటున్నారు. దానికనుగుణంగా కోతలు పూర్తికాగానే వచ్చి తీసుకెళ్తారు. ఒక్కో గ్రామంలో ఒక్కో ధర నిర్ణయించారు. ఈ ఏడాది ఎక్కువ గ్రామాల్లో క్వింటాలు రూ. 3,500 మాత్రమే చెల్లిస్తున్నారు. దీనికి తోడు క్వింటాకు 5 - 10 కిలోల కడ్తా పేరుతో తరుగు తీస్తున్నారు. అయితే ఆశించినంత దిగుబడులు లేకపోవడంతో కనీసం రూ. వేయి ధర పెంచాలని కోరుతున్నారు. దశాబ్దాల తరబడి ఈ దోపిడీ ఇలాగే కొనసాగుతున్న అడ్డుకట్ట వేసే మార్గం అధికారులకు దోరకడం లేదు.

జిల్లాలో పండించిన ఎర్ర, తెల్లజొన్నల మాదిరే సజ్జ పంటను ఉత్తర భారతానికి ఎగుమతి చేస్తారు. అక్కడి వ్యాపారులతో ముందస్తుగా ధర ఖరారు చేసుకుని ఇక్కడ పండించి కమీషన్‌పై అమ్ముకుంటారు. అయితే ఈ వ్యాపారం కొంతమంది చేతుల్లోనే ఉండడంతో బయట మార్కెట్‌ తెలియక అన్నదాతల నిలువు దోపిడీకి గురవుతున్నారు. దాదాపు రూ. 7 కోట్ల మేర పంట ఉత్పత్తులు జరుగుతున్న రైతులకు మాత్రం లాభాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. 

Related Posts