YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

గులాబీ వర్సెస్ కమలం

గులాబీ వర్సెస్ కమలం

హైద్రాబాద్, ఫిబ్రవరి 1,
కేంద్రంలోని బీజేపీతో తీవ్ర స్థాయిలో యుద్ధం చేయాలని, రాజకీయంగా ఆ పార్టీ శత్రువేనని టీఆర్ఎస్ ఎంపీలకు అధినేత కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఆ పార్టీపై అన్ని రూపాల్లో పోరు చేయాల్సిందేనని, సాఫ్ట్ కార్నర్ వద్దని స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వడ్ల కొనుగోళ్ల విషయంలో ప్రదర్శించిన దూకుడును మరింతగా పెంచాలని, ఉభయ సభలను స్తంభింపజేసే స్థాయిలో ఉండాలని వివరించారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వైఖరిపై ఉభయ సభల ఎంపీలతో ప్రగతి భవన్‌లో  సుదీర్ఘంగా సమావేశం నిర్వహించిన కేసీఆర్ 23 అంశాలతో కూడిన బుక్‌లెట్‌ను అందజేశారు. విభజన హామీలను సాధించుకోడానికి, రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులను రాబట్టుకోడానికి, డిమాండ్ల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలో నిలదీయాలని స్పష్టం చేశారు.రాష్ట్ర అవసరాలపై ఇప్పటివరకు తనతో పాటు పలువురు మంత్రులు లేఖలు రాశారని, ఢిల్లీలో స్వయంగా కలిసినప్పుడు కేంద్ర మంత్రులకు వివరించారని, ఇప్పుడు పార్లమెంటు వేదికగా కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీతో ఎలాంటి దోస్తానా లేదని, అది ముమ్మాటికీ టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ శత్రువేనని, వెనక్కి తగ్గేదే లేదని కేసీఆర్ ఈ సమావేశంలో ఎంపీలకు క్లారిటీ ఇచ్చారు. ఆ పార్టీ పట్ల ఎలాంటి మెతకవైఖరి అవసరం లేదని, రాజకీయ శత్రుత్వంతోనే కొనసాగాలని పిలుపునిచ్చారు. ఎలాగూ రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వదని, ఆ విషయం ఇప్పటిదాకా కొనసాగించిన వైఖరితోనే తేటతెల్లమైందని, ఇక చేయాల్సింది చేయడమే టీఆర్ఎస్ వైఖరిగా ఉండాలని ఎంపీలకు నొక్కిచెప్పారు.పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వరి ధాన్యం కోనుగోళ్ల అంశంపై ఉభయ సభలను స్థంభింపజేసిన మోతాదుకు మించి ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ దూకుడు ఉండాలని కేసీఆర్ స్పష్టం చేసినట్లు ఎంపీలు పేర్కొన్నారు. బయ్యారం ఉక్కు, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్శిటీ, ఐఐఎం, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ, మెగా టెక్స్‌టైల్ పార్కు తదితర పలు హామీలపై కేంద్రాన్ని నిలదీయాలని ఆదేశించారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, ఎరువుల ధర పెంపు, కొత్త విద్యుత్ చట్టం, సివిల్ సర్వీసెస్ రూల్స్‌కు సవరణ తదితర అంశాలపైనా పార్లమెంటు వేదికగా గట్టిగా నిరసన తెలియజేయాలన్నారు. రాష్ట్రంలోని వివిధ విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీఎంవో ముఖ్య కార్యదర్శి తదితరులు ఎంపీలకు వివరించారు.రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులకు సంబంధించిన అంశాలపై ఎంపీలకు వివరాలను అందజేశారు. కేంద్రంతో కొట్లాడే పోరాట పంథాపై వివరించారు. గతంలో ప్రధాని సహా కేంద్ర మంత్రులకు తెలంగాణ తరఫున అందజేసిన మెమొరాండంలు, వాటికి స్పందన రాకపోవడం లాంటివాటిని గుర్తుచేసి ఆ లేఖలను కూడా ఎంపీలకు అందించారు. విభజన చట్టంలో ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న అంశాలనూ ఈ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు ఏమేం ఇచ్చిందో పరిశీలించిన తర్వాత వాటిపై గట్టిగా నిలదీయడానికి సంబంధించి పోరాట రూపాన్ని ఎంచుకోవాలని సూచించారు. రైల్వేలు, జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలకు బడ్జెట్‌లో తెలంగాణకు దక్కిన అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.శీతాకాల సమావేశాల సందర్భంగా వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎంపీలు ఉభయ సభల్లో చేపట్టిన నిరసనను కేసీఆర్ స్వయంగా అభినందించారు. వారం రోజుల తర్వాత మొత్తం సమావేశాలనే బహిష్కరించారు. ఇప్పుడు కూడా కేంద్రంపై పోరాట స్ఫూర్తి దానికి మించి ఉండాలని నొక్కిచెప్పడంతో ఎంపీలు దానికి తగిన వ్యూహాన్ని రూపొందించుకోనున్నారు. గత సమావేశాల్లో ప్లకార్డులతో స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి నిరసన తెలిపారు. ఈ సారి ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 5వ తేదీన ముచ్చింతల్‌లోని రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని వస్తున్న నేపథ్యంలో పార్లమెంటులో టీఆర్ఎస్ వైఖరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది కీలకంగా మారింది.

Related Posts