బెంగాల్, ఫిబ్రవరి 1
బెంగాల్‌లో సీఎం వర్సెస్ గవర్నర్ మధ్య వైరం మరింత ముదిరింది. ట్విట్టర్‌లో గవర్నర్‌ను బ్లాక్ చేశారు దీదీ. గవర్నర్ పోస్టులతో విసిగిపోయానని అందుకే ఇలా చేశానని సీఎం మమతా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ మధ్య గత కొంతకాలం నుంచి వార్ కొనసాగుతూ వస్తోంది. తాజాగా అది పీక్స్‌కు వెళ్లింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను ట్విట్టర్‌లో బ్లాక్ చేశారు. ఆయన పోస్టులతో మనస్తాపానికి గురై ఇలా చేసినట్టు మమతా బెనర్జీ వెల్లడించారు. గవర్నర్ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ ట్వీట్లు పెడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు దీదీ. బెంగాల్ గవర్నర్ తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని బెదిరిస్తున్నారని ఆరోపించారు మమతా బెనర్జీ. తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ ధన్కర్‌పై మమతా బెనర్జీ ఆరోపించారు.గవర్నర్ ఇంటి నుంచే పెగాసస్ నడుస్తోందని ముఖ్యమంత్రి మమతా తీవ్ర ఆరోపణలు చేశారు. ధన్కర్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్నారు. గవర్నర్‌ను తొలగించాల్సిందిగా ప్రధానినరేంద్ర మోదీకి చాలాసార్లు లెటర్‌లు రాశానని, కానీ అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదని వివరించారు మమత. ఏడాది కాలంగా ఓపికగా కష్టపడుతున్నామని, అనేక ఫైళ్లను అతను క్లియర్ చేయలేదని ఆరోపించారు దీదీ. ప్రతి ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి వ్యక్తి విధానపరమైన నిర్ణయాలపై ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు సీఎం మమతా బెనర్జీ.అయితే, మమత బెనర్జీ ప్రభుత్వంపై గవర్నర్ ధన్‌కర్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తుంటారు. ఈ వివాదంపై స్పందించారు గవర్నర్ ధన్కర్. అన్ని విషయాలను పక్కనబెట్టి దీదీ చర్చలకు రావాలని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి వివాదాలకు తావివ్వొద్దని, చర్చలకు రావలసిందిగా కోరారు. ప్రజల కోసం అధికారంలో ఉన్న వాళ్లు కలసి పని చేయాలని సూచించారు. బెంగాల్ రక్తంతో కళంకితం అయ్యేందుకు తాను అనుమతించబోనని ధన్‌కర్ మరోసారి స్పష్టం చేశారు.